ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో సీఎం అడ్డంగా దొరికిపోయి ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. పల్నాడు ప్రాజెక్టు టెండర్ల వ్యవహారాన్ని పత్రికలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టాకే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్ డేట్‌తో ఉత్తరాలు రాసిందని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టుకు 2025 జనవరి 24నే ఏపీ టెండర్లు పిలిచిందని నాడు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గొంతు పెంచితే సరిపోదన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పల్నాడు ప్రాజెక్టు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ బయటపెట్టాకే లేఖలు..
ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్‌ను రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రాకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్నారన్నారు. కృష్ణా, గోదావరిలో నీళ్లున్నా వాటిని వినియోగించుకోవడం లేదని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నలు లేవనెత్తిన ప్రతిసారీ రేవంత్ ప్రభుత్వం బ్యాక్ డేట్‌తో లేఖలు రాస్తోందన్నారు. గోదావరి-బనకచర్ల విషయంలోనూ బీఆర్ఎస్ ఆధారాలతో ప్రశ్నించగానే వెనుకటి తేదీలతో ఉత్తరాలు రాసిందన్నారు.
సీఎం వ్యాఖ్యలపై సీరియస్..
2022లో గత ప్రభుత్వ హయాంలోనే జీవో 56 వచ్చిందంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆ జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలిస్తామని ఎక్కడైనా పేర్కొన్నారా? అని ప్రశ్నించారు. జీవో 56 కేవలం ఆర్థిక అనుమతులకు సంబంధించినదని తెలిపారు. సాగర్ నుంచి నీటిని తరలించే అంశం 2026 ఆగస్టులో విడుదలైన జీవో 453లో ఉందని స్పష్టంచేశారు. పాలమూరు జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి సీఎం వైఖరే కారణమన్నారు. 750కి.మీ దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణా జలాలు వెళ్తున్నాయని, పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు రావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు.పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ సిద్ధం చేసి ఉంచినా మూడేళ్లలో 3 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వలేకపోయారని విమర్శించారు.
మేం అనుమతులు తెస్తే..
తమ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం అదనపు టీఎంసీ, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి తీసుకుందన్నారు.కేసీఆర్ టైంలో పాలమూరులో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా కనీసం లక్ష ఎకరాలకైనా నీరు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రూ.4 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. సీఎం హోదాలో రేవంత్ అబద్ధాలు చెబితే అవి నిజాలు అయిపోవని చెప్పారు.
