Gold Price Prediction: బంగారం కొనాలా, ఆగాలా? పసిడి మార్కెట్లో డిసెంబర్ 4, 9 తేదీల్లో ఏం జరగబోతుంది!
Gold Price Prediction: బంగారం ధరలు రోజుకో ట్విస్ట్ ఇస్తుండటంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఇప్పుడు బంగారం కొనాలా, లేక మరికొన్ని రోజులు ఆగాలా? ఒక దశలో రూ. 1.80 లక్షల రికార్డు స్థాయిని తాకిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, ఆ తర్వాత రూ. 1.60 లక్షలు, రూ. 1.50 లక్షలకు దిగొస్తూ ప్రస్తుతం రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.26 లక్షల మధ్య కదలాడుతోంది. నవంబర్ 25న ఒకే రోజు రెండుసార్లు ఒడుదొడుకులకు లోనైన పసిడి మార్కెట్, ఇప్పుడు డిసెంబర్ 4, డిసెంబర్ 9 తేదీల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ రెండు తేదీలే రాబోయే రోజుల్లో బంగారం ధరల గతిని మార్చబోతున్నాయి.మన దేశంలో బంగారం ధరలు పెరగడానికైనా, తగ్గడానికైనా అమెరికా ఆర్థిక నిర్ణయాలే ప్రధాన కారణం. డిసెంబర్ 4, డిసెంబర్ 9 తేదీల్లో అమెరికా ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) గణాంకాలు, అక్కడి ఉద్యోగ నివేదికలతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి. అమెరికాలో జలుబు చేస్తే ఇండియాలో తుమ్ములు వచ్చినట్లు.. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు నేరుగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను, బంగారం రేట్లను కుదిపేస్తాయి. ఈ రెండు తేదీల్లో పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
