జాతీయం

Gold Price Prediction: బంగారం కొనాలా, ఆగాలా? పసిడి మార్కెట్‌లో డిసెంబర్ 4, 9 తేదీల్లో ఏం జరగబోతుంది!

Gold Price Prediction: బంగారం ధరలు రోజుకో ట్విస్ట్ ఇస్తుండటంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఇప్పుడు బంగారం కొనాలా, లేక మరికొన్ని రోజులు ఆగాలా? ఒక దశలో రూ. 1.80 లక్షల రికార్డు స్థాయిని తాకిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, ఆ తర్వాత రూ. 1.60 లక్షలు, రూ. 1.50 లక్షలకు దిగొస్తూ ప్రస్తుతం రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.26 లక్షల మధ్య కదలాడుతోంది.

Gold Price Prediction: బంగారం ధరలు రోజుకో ట్విస్ట్ ఇస్తుండటంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఇప్పుడు బంగారం కొనాలా, లేక మరికొన్ని రోజులు ఆగాలా? ఒక దశలో రూ. 1.80 లక్షల రికార్డు స్థాయిని తాకిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, ఆ తర్వాత రూ. 1.60 లక్షలు, రూ. 1.50 లక్షలకు దిగొస్తూ ప్రస్తుతం రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.26 లక్షల మధ్య కదలాడుతోంది. నవంబర్ 25న ఒకే రోజు రెండుసార్లు ఒడుదొడుకులకు లోనైన పసిడి మార్కెట్, ఇప్పుడు డిసెంబర్ 4, డిసెంబర్ 9 తేదీల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ రెండు తేదీలే రాబోయే రోజుల్లో బంగారం ధరల గతిని మార్చబోతున్నాయి.

డిసెంబర్ 4, 9 తేదీలు ఎందుకంత కీలకం?

మన దేశంలో బంగారం ధరలు పెరగడానికైనా, తగ్గడానికైనా అమెరికా ఆర్థిక నిర్ణయాలే ప్రధాన కారణం. డిసెంబర్ 4, డిసెంబర్ 9 తేదీల్లో అమెరికా ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) గణాంకాలు, అక్కడి ఉద్యోగ నివేదికలతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి. అమెరికాలో జలుబు చేస్తే ఇండియాలో తుమ్ములు వచ్చినట్లు.. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు నేరుగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను, బంగారం రేట్లను కుదిపేస్తాయి. ఈ రెండు తేదీల్లో పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముడి బంగారం ధర కంటే నగల మోతే ఎక్కువ!

ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల ముడి బంగారం 10 గ్రాములకు రూ. 1.26 లక్షలు, 22 క్యారెట్ల బంగారం రూ. 1,15,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ షాపుకు వెళ్లి ఆభరణాలు కొనాలంటే మాత్రం లెక్క పూర్తిగా మారిపోతోంది. మజూరీ, తరుగు, జీఎస్టీ అన్నీ కలుపుకొని 10 గ్రాముల నగలకు దాదాపు రూ. 1,43,900 (సుమారు రూ. 1.44 లక్షలు) వరకు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు వెండి ధర కూడా గరిష్ఠ స్థాయి రూ. 3.55 లక్షల నుంచి సగానికి పడిపోయి, ఇప్పుడు కేజీ రూ. 1.65 లక్షల వద్ద కొనసాగుతోంది.

ధరలను శాసిస్తున్న అంతర్జాతీయ లెక్కలివే!

మన దేశ అవసరాల్లో 85 శాతం బంగారాన్ని స్విట్జర్లాండ్, దుబాయ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 92 నుంచి రూ. 96 స్థాయికి పడిపోవడం దిగుమతుల భారాన్ని పెంచుతోంది. దుబాయ్, అమెరికాలలో 10 గ్రాముల బంగారం రూ. 1.06 లక్షలకే దొరుకుతుంటే, పన్నులు, రూపాయి విలువ కారణంగా మన దగ్గర రూ. 20 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్నా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు పరుగులు తీస్తారు. దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేయడం ధరలకు రెక్కలు తొడుగుతోంది.

ఇప్పుడు కొనాలా, ఆగాలా?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.32 లక్షల వద్ద స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాల అవసరాలు ఉన్నవారు రేట్లు ఇంకా పెరగకముందే కొనుగోలు చేయడం మంచిది. కానీ పెట్టుబడి కోసం (భౌతిక బంగారం, డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్లు) ఎదురుచూసే వారు మాత్రం తొందరపడకుండా డిసెంబర్ 4, 9 తేదీల్లో వెలువడే అమెరికా ఫెడ్ నిర్ణయాలు, మార్కెట్ స్పందనను గమనించి అడుగు వేయడం ఉత్తమం అని చెబుతున్నారు.

తర్వాత చదవండి