PM Modi : రాయితీలు సరే.. మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా? కొత్త నియామకాలేవి? : ప్రధాని మోడీ
దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. స్వయంగా ప్రధాని మోడీ కార్పొరేట్ దిగ్గజాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదని.. మరి కొత్త ఉద్యోగాలు ఏవి? మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా? లేదా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ టాక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని గుర్తుచేశారు. కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును రూ.12 లక్షల వరకు పూర్తిగా మినహాయించిన విషయాన్ని సైతం నొక్కిచెప్పారు. 'మీరు ఎప్పుడూ రాయితీలు కావాలని అడుగుతూనే ఉంటారు. అందుకు తగ్గట్టుగా ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నారా? ఉద్యోగులకు జీతాలను పెంచారా?' అంటూ ప్రధాని మోడీ నిలదీశారు. గురువారం దేశరాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) శతాబ్ది ఉత్సవాల వార్షిక సదస్సును ప్రధాని ప్రారంభించారు.
