దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. స్వయంగా ప్రధాని మోడీ కార్పొరేట్ దిగ్గజాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదని.. మరి కొత్త ఉద్యోగాలు ఏవి? మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా? లేదా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ టాక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని గుర్తుచేశారు. కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును రూ.12 లక్షల వరకు పూర్తిగా మినహాయించిన విషయాన్ని సైతం నొక్కిచెప్పారు.
'మీరు ఎప్పుడూ రాయితీలు కావాలని అడుగుతూనే ఉంటారు. అందుకు తగ్గట్టుగా ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నారా? ఉద్యోగులకు జీతాలను పెంచారా?' అంటూ ప్రధాని మోడీ నిలదీశారు. గురువారం దేశరాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) శతాబ్ది ఉత్సవాల వార్షిక సదస్సును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని కీలక వ్యాపారవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ట్యాక్స్ రిటర్న్స్, రీఫండ్లను సులభతరం చేశామని, గతంలో 8 నెలలు పట్టే రీఫండ్లు ఇప్పుడు వారం రోజుల్లోనే వస్తున్నాయని చెప్పారు.
ఇండియా ఫస్ట్ నినాదంతోనే జాబ్స్..
వచ్చే 20 ఏండ్లలో పారిశ్రామికవేత్తలు తీసుకునే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలకు ‘ఇండియా ఫస్ట్’ అనేది పునాది కావాలన్నారు. ఫలితంగా దేశం ఆత్మనిర్భర్గా మారడమే కాకుండా, వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఫిక్కీని అభినందించిన ప్రధాని మోడీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో ఫిక్కీ కీలక పాత్ర పోషించిందని మెచ్చుకున్నారు.
పేదరికం నుంచి 50 కోట్ల మంది ఔట్..
గత వందేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులకు గురైందని ప్రధాని మోడీ అన్నారు. గత 12 ఏళ్లలో యువత, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితో నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా (7 శాతం వృద్ధి)తో భారత్ అవతరించిందని వెల్లడించారు. గత నెలలో స్వదేశీ వస్తువుల ఎగుమతులు దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయన్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. కేవలం 12-13 ఏళ్లలోనే 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించారని ప్రధాని స్పష్టంచేశారు.
