Rains in AP & TG : తెలంగాణ, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
ఏపీ,తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుందని, నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని ఐఎండీ తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో ఈ ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు,మూడు రోజుల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.ఇక తెలంగాణలోనూ వాతావరణం చల్లగా మారి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ద్రోణి ప్రభావం కారణంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
