తెలంగాణ

TG: మెట్రో నిధులపై కేంద్రం చేతులెత్తేసిందా? ముదురుతున్న రాజకీయ రగడ..

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు నిధుల మంజూరు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన తాజా కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన రుణం గురించి తనకు తెలియదని, మెట్రో ఆర్థిక సాయం తన పరిధిలోని అంశం కాదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి అవసరమైన రుణాలు, అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. అంతేకాకుండా, ఐఆర్ఎఫ్‌సీ రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 84.32 కోట్ల ముందస్తు ఫీ, ఎస్క్రో అకౌంట్లో రూ. 1,461.47 కోట్ల ఈక్విటీ వాటాను కూడా జమ చేసినట్లు స్పష్టం చేసింది. జూన్ నెలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రితో కలిసి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యి, నిధుల విడుదలకు చొరవ తీసుకున్నారు. అయితే, సోమవారం ఢిల్లీలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో అశ్విని వైష్ణవ్ అనూహ్యంగా యూ-టర్న్ తీసుకున్నారు. ఐఆర్ఎఫ్‌సీ రుణ ఒప్పందాల సంగతి తనకు తెలియదని, అది తన పరిధిలోకి రాదని వ్యాఖ్యానించడం రాష్ట్ర వర్గాలను విస్మయానికి గురిచేసింది.