TG: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు నిధుల మంజూరు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన తాజా కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన రుణం గురించి తనకు తెలియదని, మెట్రో ఆర్థిక సాయం తన పరిధిలోని అంశం కాదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది?
మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి అవసరమైన రుణాలు, అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. అంతేకాకుండా, ఐఆర్ఎఫ్సీ రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 84.32 కోట్ల ముందస్తు ఫీ, ఎస్క్రో అకౌంట్లో రూ. 1,461.47 కోట్ల ఈక్విటీ వాటాను కూడా జమ చేసినట్లు స్పష్టం చేసింది. జూన్ నెలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రితో కలిసి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యి, నిధుల విడుదలకు చొరవ తీసుకున్నారు. అయితే, సోమవారం ఢిల్లీలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో అశ్విని వైష్ణవ్ అనూహ్యంగా యూ-టర్న్ తీసుకున్నారు. ఐఆర్ఎఫ్సీ రుణ ఒప్పందాల సంగతి తనకు తెలియదని, అది తన పరిధిలోకి రాదని వ్యాఖ్యానించడం రాష్ట్ర వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఇరకాటంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రైల్వే మంత్రి వ్యాఖ్యలతో సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయంగా ఇరకాటంలో పడినట్లు అయ్యిందని అంటున్నారు. గతంలో మెట్రో నిధుల విషయంలో తాను చొరవ తీసుకుని రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించిన కిషన్ రెడ్డి, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం అన్ని నిధులు చెల్లించామని చెబుతుంటే, కేంద్ర మంత్రుల మధ్య సమన్వయ లోపం వల్లే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు సంధిస్తున్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమా?
మెట్రో నిధుల జాప్యంపై ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఐఆర్ఎఫ్సీ వంటి రైల్వే అనుబంధ సంస్థల నిధుల మంజూరుపై రైల్వే మంత్రికే అవగాహన లేదనడం కేవలం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని రాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. మరోవైపు, మెట్రో విస్తరణ ప్రతిపాదనలు, డీపీఆర్ అంశాలు పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడం వల్లే సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కొందరు నేతలు కేంద్రంపై నెపం నెడుతున్నారని విపక్షాలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. మొత్తానికి, సాంకేతిక కారణాలు, నిధుల విడుదలపై స్పష్టత కొరవడటంతో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
