తెలంగాణ

Kalvakuntla Kavitha: మెట్టినింటి నుంచి కవితక్క సెకండ్ ఇన్నింగ్స్? ఆ నియోజకవర్గంపై టీఆర్ఎస్ చీఫ్ కన్ను!

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అత్తారిల్లు అయిన బోధన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసిన ఆమె, మెట్టినింటి సెంటిమెంట్‌తో పాటు స్థానిక సమీకరణాలను అందిపుచ్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా తాను ఈ జిల్లా నుంచే పోటీ చేస్తానని కవిత సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.గతంలో నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన కవితకు ఉమ్మడి జిల్లా రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా ఓటమి పాలయ్యారు. నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలే తన ఓటమికి కారణమయ్యారని కవిత పలు రాజకీయ వేదికలపై బహిరంగంగానే ఆరోపించారు.