Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అత్తారిల్లు అయిన బోధన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసిన ఆమె, మెట్టినింటి సెంటిమెంట్‌తో పాటు స్థానిక సమీకరణాలను అందిపుచ్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా తాను ఈ జిల్లా నుంచే పోటీ చేస్తానని కవిత సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఓడిన చోటే సత్తా చాటాలని..
గతంలో నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన కవితకు ఉమ్మడి జిల్లా రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా ఓటమి పాలయ్యారు. నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలే తన ఓటమికి కారణమయ్యారని కవిత పలు రాజకీయ వేదికలపై బహిరంగంగానే ఆరోపించారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టిన నేపథ్యంలో, తనను ఓడించిన వారికి రాజకీయంగా సమాధానం చెప్పడంతో పాటు, బీఆర్ఎస్కు బలమైన కోటగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బోధన్ సమీకరణాలు అనుకూలిస్తాయా?
కవిత బోధన్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలు ఉన్నాయని స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని బోధన్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసుల కారణంగా దుబాయ్‌కి పరిమితమయ్యారని, వచ్చే ఎన్నికల్లో తన భార్య ఆయిషా ఫాతిమాను బరిలో దించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, అత్తారిల్లు అయిన బోధన్ నుంచి పోటీ చేయడం తనకు రాజకీయంగా కలిసివస్తుందని కవిత అంచనా వేస్తున్నట్లు సమాచారం.
ప్రధాన పార్టీల్లో కొత్త కసరత్తు!
కవిత బోధన్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలతో అక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు ఆమెను గెలిపించుకునేందుకు అనుకూల వర్గం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టగా, మరోవైపు ఆమెను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తానికి కవిత పోటీపై వస్తున్న ఈ వార్తలతో రాబోయే ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
