TG: కొండా దంపతుల ‘సైలెంట్’ స్ట్రాటజీకి కారణం ఇదేనా!
TG: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ దూకుడుగా ఉంటూ, ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలిచే కొండా దంపతులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి కొండా సురేఖ పదవి కోల్పోయినప్పటి నుంచి ఆమె వ్యవహారశైలిలో వచ్చిన అనూహ్య మార్పు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు అసెంబ్లీ సమావేశాలకు గానీ, ఇటు పార్టీ నిరసన కార్యక్రమాలకు గానీ దూరంగా ఉంటున్న కొండా దంపతుల మౌనం వెనుక ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది.మంత్రి పదవి నుంచి తప్పించిన సమయంలో, "పదవికి మాత్రమే దూరం తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదు" అంటూ కొండా మురళి గట్టిగానే ప్రకటించారు. కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా మారిపోయింది. కొండా సురేఖ కేవలం తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ సాయం అందించే కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు.
