TG: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ దూకుడుగా ఉంటూ, ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలిచే కొండా దంపతులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి కొండా సురేఖ పదవి కోల్పోయినప్పటి నుంచి ఆమె వ్యవహారశైలిలో వచ్చిన అనూహ్య మార్పు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు అసెంబ్లీ సమావేశాలకు గానీ, ఇటు పార్టీ నిరసన కార్యక్రమాలకు గానీ దూరంగా ఉంటున్న కొండా దంపతుల మౌనం వెనుక ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది.
నియోజకవర్గానికే పరిమితం.. పార్టీ ప్రోగ్రామ్స్‌కు దూరం!
మంత్రి పదవి నుంచి తప్పించిన సమయంలో, "పదవికి మాత్రమే దూరం తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదు" అంటూ కొండా మురళి గట్టిగానే ప్రకటించారు. కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా మారిపోయింది. కొండా సురేఖ కేవలం తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ సాయం అందించే కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు. కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు. అటు ఢిల్లీలో జరిగిన నిరసనకు, ఇటు హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమాలకు సైతం ఆమె దూరంగానే ఉంటూ వస్తున్నారు.
కేటీఆర్‌పై యూటర్న్.. వివాదాలకు ఫుల్స్టాప్
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ఇటీవల ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి కొండా సురేఖ అందరినీ ఆశ్చర్యపరిచారు. తొందరపాటు మాటలకు క్షమించాలంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే, అనవసరపు వివాదాలకు దూరంగా ఉంటూ పూర్తిగా రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. ప్లస్ అయినా, మైనస్ అయినా ఎప్పుడూ రచ్చ రచ్చగా ఉండే కొండా వర్గం ఇప్పుడు ఇంత కూల్ అవ్వడం వెనుక బలమైన కారణమే ఉందని ఓరుగల్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ ‘ఎమ్మెల్సీ’ హామీ కోసమే మౌన వ్రతమా?
మంత్రి పదవి పోయిన తర్వాత రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న కొండా దంపతులు, తిరిగి జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించిన సమయంలోనే, ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ పెద్దల నుంచి ఒక భరోసా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్సీ పదవి వస్తే మళ్లీ ఓరుగల్లు రాజకీయాల్లో తిరిగి పుంజుకోవచ్చనే లెక్కలతోనే ప్రస్తుతం ఎలాంటి వివాదాలకు పోకుండా సైలెంట్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారట. ఒకవేళ ఆ పదవి దక్కితే మళ్లీ మునుపటిలా యాక్టివ్ అవుతారని, లేదంటే ఇలాగే కామ్‌గా ఉండిపోతారని కొండా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి కొండా దంపతుల ఈ సైలెంట్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
