తెలంగాణ

NIMS : నిమ్స్ టెండర్లలో భారీ అక్రమాలు.. ఒక్కో బెడ్‌కు రూ. లక్ష లంచం!

నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ అక్రమాలు, అవినీతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారం మేరకు అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించి ఆయన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హయాంలో నిమ్స్‌లో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిమ్స్ హాస్పిటల్ టెండర్లలలో భారీగా అక్రమాలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గుర్తించారు. కోవిడ్ సమయంలో రోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయింపుల విషయంలో రూ. లక్షలు వసూళ్లు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కరోనా పాండమిక్ టైంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు ఒక్క బెడ్ కేటాయించేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. కాగా, బెడ్ కోసం సుగుణమ్మ అనే మహిళ దగ్గర రూ.లక్ష లంచం తీసుకున్నట్లు ACB ఆధారాలు సేకరించింది.