తెలంగాణ

మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరుతో ఘరానా మోసం.. రూ.50లక్షలు టోకరా

IT Minister: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. నిరుద్యోగులను నిండా ముంచాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 50లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు రామంతాపూర్ కి చెందిన కొలుగూరి రవికిరణ్. గుంటూరుకు చెందిన మీ సేవా నిర్వాహకుడు రవికుమార్ తో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

నిరుద్యోగుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు

నకిలీ ఓఎస్డీ ఐడీ కార్డు చూపించి నిరుద్యోగులకు ఎర వేశాడు రవికిరణ్. తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్ ను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి అభ్యర్థులను నమ్మించారు. టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 8 మందిని మోసం చేశారు. ఈ నెల 3న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ ఐడీ కార్డ్, తెలంగాణ ప్రభుత్వం లోగో ఉన్న కారు, పలు పత్రాలు, 2.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.