తెలంగాణ

IT Minister: మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరుతో ఘరానా మోసం.. రూ.50లక్షలు టోకరా

IT Minister: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. నిరుద్యోగులను నిండా ముంచాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 50లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు రామంతాపూర్ కి చెందిన కొలుగూరి రవికిరణ్.

IT Minister: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. నిరుద్యోగులను నిండా ముంచాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 50లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు రామంతాపూర్ కి చెందిన కొలుగూరి రవికిరణ్. గుంటూరుకు చెందిన మీ సేవా నిర్వాహకుడు రవికుమార్ తో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

నిరుద్యోగుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు

నకిలీ ఓఎస్డీ ఐడీ కార్డు చూపించి నిరుద్యోగులకు ఎర వేశాడు రవికిరణ్. తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్ ను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి అభ్యర్థులను నమ్మించారు. టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 8 మందిని మోసం చేశారు. ఈ నెల 3న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ ఐడీ కార్డ్, తెలంగాణ ప్రభుత్వం లోగో ఉన్న కారు, పలు పత్రాలు, 2.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదుతో వెలుగులోకి

మంత్రి కార్యాలయానికి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రవికిరణ్ బ్యాక్ గ్రౌండ్ పోలీసులు చెక్ చేస్తున్నారు. గతంలోనూ ఏవైనా మోసాలకు పాల్పడ్డాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

వారి మాటలు నమ్మి మోసపోవద్దు

కాగా, మంత్రుల పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరుద్యోగుల అవసరాలను కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి మోసాలకు తెగబడుతున్నారు. లక్షలు లక్షలు వసూలు చేసి ఎస్కేప్ అవుతున్నారు. అటువంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్పారు.

తర్వాత చదవండి