అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యారు- రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల కన్నా ఘాటుగా ముఖ్యమంత్రి రేవంత్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చెలరేగిపోయారు. మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యారు అని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం రేవంత్ భాషపైనా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. పండబెట్టి తొక్కుతా అని సీఎం రేవంత్ అంటారు.. నువ్వేం ముఖ్యమంత్రివి? నీ భాష ఏంది? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్ నగరేనా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రమే అని హెచ్చరించారు.
