తెలంగాణ

Komatireddy Raj Gopal Reddy: అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యారు- రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యారు అని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం రేవంత్ భాషపైనా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల కన్నా ఘాటుగా ముఖ్యమంత్రి రేవంత్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చెలరేగిపోయారు. మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

నువ్వేం ముఖ్యమంత్రివి? నీ భాష ఏంది?

అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యారు అని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం రేవంత్ భాషపైనా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. పండబెట్టి తొక్కుతా అని సీఎం రేవంత్ అంటారు.. నువ్వేం ముఖ్యమంత్రివి? నీ భాష ఏంది? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్ నగరేనా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రమే అని హెచ్చరించారు. మునుగోడులో ఓ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు

''ఆంధ్ర కనుసన్నల్లోనే పాలన సాగుతోంది. వాస్తవాలు మాట్లాడితే పదవులు రావంటున్నారు. నేను కమీషన్లు ఇవ్వను, తీసుకోను. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే యుద్ధం చేస్తాం. వదిలిపెట్టేది లేదు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమేనా? తండ్రి పాత్ర పోషించాల్సిన సీఎం ఈ విధంగా వివక్ష చూపించడం సరికాదు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరు. వాస్తవాలు మాట్లాడితే పదవులు రావు అంటున్నారు. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వంలో కూడా దోపిడీ చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డ వాళ్ళను జైల్లో పెట్టాలి'' అని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్ నగరేనా?

''తెలంగాణ అంటే ఒక కొడంగల్, మధిర కాదు. గతంలో కేసీఆర్ కూడా సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్.. అప్పుడూ కొట్లాడినా. నా బతుకంతా కొట్లాడేదే. మంత్రి పదవి లేకున్నా పర్లేదు. మీరే ఉండండి పదవుల్లో. ఏమన్నా అంటే సీఎం రేవంత్ కొడంగల్ అంటారు. ఆయన మధిర అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో హుజూర్ నగర్ అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది? నేను అడిగిన దాంట్లో తప్పేముంది? అడగొద్దా?

10వేల కోట్లు కొడంగల్ కి తీసుకుపోతా అంటున్నారు. మునుగోడు అత్యధిక ఫ్లోరైడ్, కరువు ప్రాంతం. ఇక్కడి జనం విషం నీరు తాగుతున్నారు. చెరువులు, కుంటలకు కూడా 500 కోట్లు ఇవ్వలేదు. మూడేళ్లు అవుతున్నా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పని మొదలు కాలేదు. రోడ్లకు పైసలు ఇవ్వలేదు. ప్రభుత్వ బడులు, ఆసుపత్రి ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మరి అడగకపోతే ఎలా? నాలుగు గోడల మధ్య అడిగితే మీరు పట్టించుకోవడం లేదు. బయట మాట్లాడితేనేమో క్రమశిక్షణ అంటున్నారు. ఏం క్రమశిక్షణ?

కొడంగల్ కు 10వేల కోట్లా? అన్న వాళ్లను పండబెట్టి తొక్కుతా అని ముఖ్యమంత్రి రేవంత్ అంటారు. నువ్వేం ముఖ్యమంత్రివి? నీ భాష ఏంది? కొడంగల్ కు 10వేల కోట్లు కాకపోతే 20వేల కోట్లు తీసుకుపో. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే అడుగుతుంటే.. అది పాజిటివ్ గా ఆలోచించి వెనుకబడిన నియోజకవర్గాలు అన్నింటిని అభివృద్ధి చేస్తామని అనాల్సింది పోయి.. పండపెట్టి తొక్కుతా అంటారా? తొక్కించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి అంత ఈజీగా కనిపిస్తున్నాడా? ఇటువంటి భాష మంచిది కాదు ముఖ్యమంత్రి గారు.

అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యావ్

నీకు అదృష్టం కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి అయినావ్. ఇంకా రెండేళ్లు కూడా మంచిగా ఉండు. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకో. కొడంగల్ తో పాటు వెనుకబడిన నియోజకవర్గాలు మునుగోడు, ములుగు, ఆదిలాబాద్ ను కూడా చూసుకో. నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలని ఈ స్వామి మాలలో ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. నువ్వు బాగుండాలి. బుల్లెట్ అప్పుడే దిగాల్సింది. చరిత్ర సృష్టించాల్సిన మునుగోడు ప్రజలు తప్పు చేశారు. ఇప్పుడున్న పాలకులు మరోసారి తప్పు చేస్తే మాత్రం అటువంటి నిర్ణయానికి వెనుకాడను.

నేను ప్రజల సొమ్ము తినే మనిషిని కాను

నేను పదవుల కోసం పని చేసే మనిషిని కాదు. నువ్వు నాకు 1000 కోట్ల కాంట్రాక్ట్ కాదు.. 5వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తానన్నా.. నువ్వు ఎంతకు ఇస్తావో చెప్పు.. దానికంటే 20% తక్కువకే చేపిస్తా. నేను ప్రజల సొమ్ము తినే మనిషిని కాను, ప్రజల సొమ్ము కాపాడే మనిషిని. నేను కమీషన్లు ఇయ్యను, కమీషన్లు తీసుకోను. ఏ సొమ్మైనా అది ప్రజల సొమ్ము.

మునుగోడుకి అన్యాయం చేస్తే అంతుచూస్తా

అధికారంలో ఉన్నోళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఒక్క రూపాయి వేస్ట్ చేసినా ఈ మునుగోడు నుంచి రాజన్న సైన్యం కదులుతుంది. నేను చెప్తున్నా ఆషామాషీ విషయం కాదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఏం చేసినా నడుస్తుందనుకుంటే ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతుంది. మునుగోడుకి అన్యాయం చేసినా, ప్రజల సొమ్ము దోచుకున్నా, వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు'' అని హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి.

తర్వాత చదవండి