తెలంగాణ

హత్య కేసులో లక్షన్నర లంచం.. ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

Peddapalli PP: పెద్దపల్లిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. లక్షన్నర రూపాయల లంచం తీసుకుంటుండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో రవీందర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నారు.

నిందితులకు అనుకూలంగా వాదిస్తానని హామీ

2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో జరిగిన భూ వివాదంలో నలుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వాదించి లబ్ది చేకూరుస్తానని రవీందర్ 2లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు లక్షన్నరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా పీపీ రవీందర్ ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో రవీందర్ తో పాటు ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.