National
PM Modi: నారీశక్తికి 33శాతం ప్రాతినిధ్యం.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ
చట్టసభల్లో నారీశక్తికి 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడే ప్రతి అవరోధాన్ని తొలగిస్తామని, విపక్షాలు ఎంత ప్రయత్నించినా మహిళల భాగస్వామ్యాన్ని ఆపలేవని తేల్చి చెప్పారు. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్లను 50 శాతం పెంచే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని, మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించి తీరుతామని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ధీమా వ్యక్తం చేశారు.
