జాతీయం

PM Modi: నారీశక్తికి 33శాతం ప్రాతినిధ్యం.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ

చట్టసభల్లో నారీశక్తికి 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడే ప్రతి అవరోధాన్ని తొలగిస్తామని, విపక్షాలు ఎంత ప్రయత్నించినా మహిళల భాగస్వామ్యాన్ని ఆపలేవని తేల్చి చెప్పారు.

 చట్టసభల్లో నారీశక్తికి 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడే ప్రతి అవరోధాన్ని తొలగిస్తామని, విపక్షాలు ఎంత ప్రయత్నించినా మహిళల భాగస్వామ్యాన్ని ఆపలేవని తేల్చి చెప్పారు. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్లను 50 శాతం పెంచే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దేశంలో మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని, మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించి తీరుతామని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ధీమా వ్యక్తం చేశారు.

 మహిళలకు రాజకీయంగా, నిర్ణయాత్మక రంగాల్లో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా తాను కూడా ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వారిలో ఒకరిగా నిలిచానని తెలిపారు. ఎంతో మంది మహిళలు తమ సమస్యలు, ఆకాంక్షలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చారని, ఎందరో సోదరీమణులు లేఖల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని నారీశక్తి ఆశీర్వాదం తమకు పూర్తిగా ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, అడ్డంకులను పూర్తిగా తొలగిస్తామని ప్రతి ఒక్క మహిళకు భరోసా ఇచ్చారు. ఈ విషయంలో తమ ఆత్మవిశ్వాసం బలంగా ఉందని, ధైర్యం చెక్కుచెదరనిదని, సంకల్పం అచంచలమని మోదీ ఉద్ఘాటించారు.

 మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళల భాగస్వామ్యం పెరగకుండా ఎప్పటికీ ఆపలేవని స్పష్టం చేశారు. ఈ మార్పు కోసం కేవలం సమయం మాత్రమే వేచి చూడాల్సి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబర్ 30న లోక్‌సభతో, డిసెంబర్ 2న రాజ్యసభతో ప్రారంభమై డిసెంబర్ 3తో ముగియనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను 50 శాతం ఏకరీతిన పెంచేలా తాజా బిల్లులో హామీ ఇవ్వడంతో గత ఏప్రిల్‌లో వ్యతిరేకించిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, డీఎంకే ఇప్పుడు మద్దతు తెలిపాయి.

 మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి లోక్‌సభలో కేటాయించిన సీట్లు, అలాగే వాటి శాసనసభల బలాన్ని 50 శాతం పెంచి, 2051 వరకు సవరించిన సీట్ల కేటాయింపులు, సరిహద్దులను స్తంభింపజేసేలా కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026 ద్వారా లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించగా, రాష్ట్ర అసెంబ్లీల పరిమాణ పరిమితిని 500 నుంచి 650కి పెంచాలని పొందుపరిచారు.

తర్వాత చదవండి