తెలంగాణ

Adilabad Cold Wave Reasons: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలకు కారణాలివే!

 తెలంగాణలో శీతాకాలం వచ్చిందంటే చాలు అత్యల్ప ఉష్ణోగ్రతల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలే ముందు వరుసలో నిలుస్తాయి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే పది ప్రాంతాలను పరిశీలిస్తే, వాటిలో సగానికి పైగా ఐదారు ప్రదేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే ఉంటాయి. ముఖ్యంగా భీంపూర్ మండలంలోని అర్లి(టి), బేల, కుమురం భీం జిల్లాలోని సిర్పూర్(యు), గిన్నెధరి వంటి ప్రాంతాల్లో ఏటా రికార్డు స్థాయిలో చలి నమోదవుతోంది. ఈ ప్రాంతాల్లో చలి ఇంత తీవ్రంగా ఉండటానికి గల భౌగోళిక, వాతావరణ కారణాలను వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఉత్తర భాగంలో ఉన్న ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలు శీతాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి ఎక్కువగా లోనవుతాయని ఆయన తెలిపారు.