తెలంగాణ

Adilabad Cold Wave Reasons: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలకు కారణాలివే!

తెలంగాణలో శీతాకాలం వచ్చిందంటే చాలు అత్యల్ప ఉష్ణోగ్రతల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలే ముందు వరుసలో నిలుస్తాయి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే పది ప్రాంతాలను పరిశీలిస్తే, వాటిలో సగానికి పైగా ఐదారు ప్రదేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే ఉంటాయి.

 తెలంగాణలో శీతాకాలం వచ్చిందంటే చాలు అత్యల్ప ఉష్ణోగ్రతల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలే ముందు వరుసలో నిలుస్తాయి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే పది ప్రాంతాలను పరిశీలిస్తే, వాటిలో సగానికి పైగా ఐదారు ప్రదేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే ఉంటాయి. ముఖ్యంగా భీంపూర్ మండలంలోని అర్లి(టి), బేల, కుమురం భీం జిల్లాలోని సిర్పూర్(యు), గిన్నెధరి వంటి ప్రాంతాల్లో ఏటా రికార్డు స్థాయిలో చలి నమోదవుతోంది.

ఈ ప్రాంతాల్లో చలి ఇంత తీవ్రంగా ఉండటానికి గల భౌగోళిక, వాతావరణ కారణాలను వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఉత్తర భాగంలో ఉన్న ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలు శీతాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి ఎక్కువగా లోనవుతాయని ఆయన తెలిపారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటమూ ఈ తీవ్రమైన చలికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. వాతావరణంలో తేమ తగ్గినప్పుడు రాత్రివేళల్లో భూమి నుంచి వేడి వేగంగా వాతావరణంలోకి వెళ్లిపోతుంది.

దీనికి తోడు కొండలు, లోయలు ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట చల్లని గాలి కిందికి చేరి అక్కడే కొంతసేపు ఆగిపోతుంది. ఈ కారణంగానే ఇతర ప్రాంతాలతో పోలిస్తే బేల, గిన్నెధరి, అర్లి(టి), సిర్పూర్(యు) ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు కూడా చలి తీవ్రతను పెంచుతున్నాయి. ఆదిలాబాద్‌లోని అర్లి(టి) గ్రామం ఉత్తర దిశగా మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో శీతల గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది.

గతంలో ఇక్కడ 2.1 డిగ్రీల రికార్డు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, 2025 జనవరి 5న 5.9 డిగ్రీలుగా నమోదైంది. బేల మండలం సమీపంలో పెన్‌గంగా నది ప్రవహించడం, చుట్టూ వ్యవసాయ భూములు ఉండటంతో పట్టణాల మాదిరిగా రాత్రి వేడి నిలవక గతంలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్(యు) ప్రాంతం ఉత్తర, ఈశాన్య దిశలో ఉండటం, దట్టమైన అడవులు, ఎత్తైన భూభాగాల వల్ల రెండేళ్ల క్రితం 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 గిన్నెధరి ప్రాంతంలో చుట్టూ ఉన్న అడవులు, కొండలు, లోయలు, తక్కువ జనాభా సాంద్రత వంటి భౌగోళిక అంశాల వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. 2025 డిసెంబర్‌లో ఇక్కడ 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాలు, ఎత్తైన భూభాగాలు, తక్కువ తేమ కలిసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యంత చల్లని ప్రాంతంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

తర్వాత చదవండి