Bhu Bharathi : భూభారతిలో రికార్డులు, హక్కులు మాయం.. సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు!
ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భూరతి అక్రమాలకు అడ్డగా మారినట్టు తెలుస్తోంది. రూ.లక్షల కోట్ల విలువైన భూముల డేటాకు ప్రమాదం పొంచి ఉంది. పోర్టల్‌లోని కొన్ని లోపాలను అడ్డం పెట్టుకొని కొందరు అక్రమార్కులు లెక్కలేనన్ని ‘అక్రమ లావాదీవీల’కు తెరలేపారు. మ్యుటేషన్లు, హక్కుల మార్పిడి వంటి నేరానికి దొంగల ముఠాలు పూనుకున్నాయి. సాఫ్ట్వేర్ లోపాలను ఆసరాగా చేసుకొని ఈ మోసానికి పాల్పడినట్టు సమాచారం. విచారణలో భాగంగా సీఐడీ పోలీసులు షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. భూభారతిని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు ఏకంగా డిజిటల్ రికార్డులను మార్చేశారు. స్కాంలో తహసీల్దార్లు, భూభారతి ఆపరేటర్ల హస్తం ఉందని తెలుస్తోంది. మండల ఆఫీసుల్లో ఎమ్మార్వో లాగిన్‌తో ఓపెన్ చేసే కంప్యూటర్ల ద్వారానే ఈ దందా అంతా నడిచినట్టు తెలిసింది. ఎనీ డెస్క్(Any Desk) సాయంతో రికార్డులు మాయం చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇదంతా ఎమ్మార్వోలకు తెలిసే జరిగిందా? లేక తెరవెనుక గుట్టుగా నడిపించారా? అనేది తెలియాల్సి ఉంది.
