ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భూరతి అక్రమాలకు అడ్డగా మారినట్టు తెలుస్తోంది. రూ.లక్షల కోట్ల విలువైన భూముల డేటాకు ప్రమాదం పొంచి ఉంది. పోర్టల్‌లోని కొన్ని లోపాలను అడ్డం పెట్టుకొని కొందరు అక్రమార్కులు లెక్కలేనన్ని ‘అక్రమ లావాదీవీల’కు తెరలేపారు. మ్యుటేషన్లు, హక్కుల మార్పిడి వంటి నేరానికి దొంగల ముఠాలు పూనుకున్నాయి. సాఫ్ట్వేర్ లోపాలను ఆసరాగా చేసుకొని ఈ మోసానికి పాల్పడినట్టు సమాచారం. విచారణలో భాగంగా సీఐడీ పోలీసులు షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు.
గుట్టుగా డిజిటల్ రికార్డుల మార్పు..
భూభారతిని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు ఏకంగా డిజిటల్ రికార్డులను మార్చేశారు. స్కాంలో తహసీల్దార్లు, భూభారతి ఆపరేటర్ల హస్తం ఉందని తెలుస్తోంది. మండల ఆఫీసుల్లో ఎమ్మార్వో లాగిన్‌తో ఓపెన్ చేసే కంప్యూటర్ల ద్వారానే ఈ దందా అంతా నడిచినట్టు తెలిసింది. ఎనీ డెస్క్(Any Desk) సాయంతో రికార్డులు మాయం చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇదంతా ఎమ్మార్వోలకు తెలిసే జరిగిందా? లేక తెరవెనుక గుట్టుగా నడిపించారా? అనేది తెలియాల్సి ఉంది. భూభారతి ఆపరేటర్ల సంపూర్ణ సహకారంతోనే నిందితులు భూ రికార్డులను తారుమారు చేసినట్టు తెలిసింది. ఐడీలు వేరు కావచ్చు.కానీ ఒక్క తహసీల్దార్ అథెంటికేషన్ లేకుండా ఏ ప్రక్రియ పూర్తి కాదు. అందుకే సీఐడీ విచారణలో అధికారుల పాత్రపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క ఐడీ ద్వారానే 14 జిల్లాల్లో భారీగా భూ రికార్డులు మాయం, మార్పులు చేర్పులు జరిగినట్టు విచారణలో తేలింది.
ఇద్దరి ఐడీలతో భారీ స్కాం..
సీఐడీ విచారణలో రెండు ఐడీల ద్వారానే వందలాది లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. పవన్ కల్యాణ్ ఐడీతో 14 జిల్లాలు, 43 మండలాలు, 56 గ్రామాల్లో 125 ఫైళ్లు అక్రమంగా క్లియర్ అయ్యాయి. అల్లాఉద్దీన్ అనే ఐడీతో 160 లావాదేవీలు జరిగినట్టు తెలిసింది. తెరవెనుక ఈ అక్రమార్కులకు ఎవరు సహకరించారు?అనేది తెలియాల్సి ఉంది. అక్రమ ఫైల్ క్లియరెన్సుల కోసం క్లైయింట్లను వీళ్ల దగ్గరికి తీసుకురావడానికి ఎంతో మంది సహకరించి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
తహసీల్దార్ ఫిర్యాదుతో వెలుగులోకి నిజాలు..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ కే.సరస్వతి ఫిర్యాదు మేరకు ఈ అక్రమ దందా తెరమీదకు వచ్చింది. కొల్లూరులో ఓ సర్వే నెంబర్ లో ఏకంగా 3 ఎకరాలను రాత్రికి రాత్రే మార్చేసినట్టు సమాచారం. ప్రొసీజర్, డాక్యుమెంట్ల పరిశీలన లేకుండానే ల్యాండ్ మ్యుటేషన్ పూర్తి చేశారు. ఫీల్డ్ ఎంక్వయిరీ లేదు. ఫిజికల్/డిజిటల్ వెరిఫికేషన్ లేకుండా, సంబంధిత అధికారుల పాత్ర లేకుండానే లావాదేవీలు జరిగాయి. ఇదంతా ఎలా జరిగింది? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.
ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు తొలుత ఈ కేసును స్థానిక పోలీసులు విచారించగా.. ఆ తర్వాత సీఐడీకి బదిలీ అయ్యింది.సీఐడీ అధికారులు తవ విచారణలో 14 జిల్లాల్లో పాకిన అక్రమార్కుల దందాను ఛేదించినట్టు సమాచారం. భూభారతిని అడ్డం పెట్టుకుని అక్రమార్కు పాల్పడిన వారిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు, భూభారతి ఆపరేటర్లు ఉన్నట్టు తెలిసింది. అంతేకాకుండా, మీ సేవా కేంద్రాలు నడిపే వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులోని ప్రధాన నిందితులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
ఎనీడెస్క్తో సాయంతో భూ దందా..
నిందితులు నగర శివారు ప్రాంతాల్లో ఇద్దరు తహసీల్దార్ల కంప్యూటర్లలో ఎనీడెస్క్ని ఇన్స్టాల్ చేసి.. వాటి ద్వారానే పవన్ కళ్యాణ్, అల్లాఉద్దీన్ పేరిట ఉన్న ఐడీల సాయంతో వందలాది అక్రమ ట్రాన్సాక్షన్లకు పాల్పడ్డారని సమాచారం. సీసీఎల్ఏ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల సహకారం కూడా ఈ కేసులో ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎనీ డెస్క్‌తో ఎమ్మార్వో కంప్యూటర్ యాక్సెస్ లభించిందంటే భూభారతి ఆపరేటర్ల పాత్ర ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. బయోమెట్రిక్ ద్వారా జరిగితే తహసీల్దార్ల పాత్ర కూడా ఉండొచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సాధారణంగా లాగిన్ వివరాలు తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు, సీసీఎల్ఏ అధికారులకు మాత్రమే ఉంటుంది. వీళ్లలోనే కొందరు నిందితులకు సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్రమ దందా ఎలా సాగిందంటే?
భూభారతి పోర్టల్‌లోని పెండింగ్ మ్యుటేషన్లను అక్రమంగా ప్రాసెస్ చేయడం, రెవెన్యూ అధికారులు చేయాల్సిన ప్రతి ప్రక్రియను, ట్రాన్సాక్షన్స్‌ను అక్రమంగా చేసి లబ్ది పొందారు. అంతేకాకుండా, అనధికారికంగా పోర్టల్‌ను ఉపయోగించుకుని డిజిటల్ అథెంటికేషన్‌తో ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేశారు. ఎమ్మార్వో లాగిన్‌తో వారి కంప్యూటర్లను వాడుకున్నారు. ఈ స్కాంలో భూభారతి ఆపరేటర్లు, ప్రభుత్వ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది.125 వరకు పెండింగ్ మ్యుటేషన్లను పూర్తి చేశారు. అథెంటికేషన్ లాగిన్స్, డిజిటల్ సంతకాల రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, సాక్షుల సంతకాలు, బయోమెట్రిక్ వంటివి ఒక్కసారి పరిశీలిస్తే మరిన్ని నేరాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
