తెలంగాణ బిడ్డల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం- సీఎం రేవంత్ పై దాసోజు శ్రవణ్ ఫైర్
Dasoju Sravan: ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ బిడ్డల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ పై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తీసుకొస్తాను అంటున్న నూతన విధానం వల్ల రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు దాసోజు శ్రవణ్. నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే లోకల్ అవుతున్నప్పుడు మిగతా రాష్ట్రాల వాళ్లు ఇక్కడికి వచ్చి లోకల్ అవుతారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముందుగా అసెంబ్లీలో చర్చించాలి
రాష్ట్రానికి సరైన విద్యాశాఖ మంత్రి కావాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్. కేవలం రేవంత్ రెడ్డి కుమార్తె, మంత్రి పొంగులేటి విద్యా సంస్థల లబ్ది కోసమే ఇంటర్ విద్యను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేయాలంటే ముందు అసెంబ్లీలో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు.
