Dasoju Sravan: ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ బిడ్డల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ పై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తీసుకొస్తాను అంటున్న నూతన విధానం వల్ల రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు దాసోజు శ్రవణ్. నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే లోకల్ అవుతున్నప్పుడు మిగతా రాష్ట్రాల వాళ్లు ఇక్కడికి వచ్చి లోకల్ అవుతారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముందుగా అసెంబ్లీలో చర్చించాలి
రాష్ట్రానికి సరైన విద్యాశాఖ మంత్రి కావాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్. కేవలం రేవంత్ రెడ్డి కుమార్తె, మంత్రి పొంగులేటి విద్యా సంస్థల లబ్ది కోసమే ఇంటర్ విద్యను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేయాలంటే ముందు అసెంబ్లీలో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు.
నాలుగేళ్లు ఇక్కడే చదివితే లోకల్స్ అయిపోతారు.
''రేవంత్ రెడ్డి కూతురు కార్పొరేట్ స్కూల్స్ పెడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిది కూడా స్కూల్ ఉంది. రెవెన్యూ, ఎడ్యుకేషన్ మంత్రుల పిల్లలు స్కూల్స్ పెడుతున్నారు. కింద కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు.. మొత్తం తెలంగాణకు వచ్చేస్తారు. నైమిష స్కూల్ కావచ్చు, పొంగులేటి రాఘవ స్కూల్స్ కావచ్చు.. ఈ స్కూళ్లలో వాళ్లంతా నైన్త్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకుంటారు. నాలుగేళ్లు ఇక్కడ చదువుతారు. లోకల్ అయిపోతారు. మరి తెలంగాణ బిడ్డలు ఏం కావాలి? ఆఖరికి ఇక్కడ కూడా తెలంగాణ బిడ్డల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ అనర్హుడు
చట్టాలు పట్టుకొచ్చే ముందు, ప్రతిపాదన పట్టుకొచ్చే ముందు విస్తృతంగా చర్చించాలి. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్లకో, ఇంకెవరో బాబులకు వదిలిపెట్టేది కాదు. ఇది విద్యాశాఖ. తప్పుగా ఆటలాడొద్దు. ఆయన భాష, వ్యవహారం, అవినీతి.. విద్యాశాఖ మంత్రిగా ఉండడానికి రేవంత్ అనర్హుడు. స్మృతి ఇరానీకి ఏ రూల్ అయితే కాంగ్రెస్ పార్టీ అప్లయ్ చేసిందో.. అదే రూల్ రేవంత్ రెడ్డికి కూడా అప్లయ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా డిమాండ్ చేస్తున్నా.
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం
సీఎం రేవంత్ తెలంగాణ విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైంది? అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, విద్యారంగానికి కేటాయింపులు ఇప్పటికీ 8.22 శాతానికే పరిమితమయ్యాయి.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయొద్దు
విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విశ్వవిద్యాలయాల బలోపేతం ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత కాదా? హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం కాదు.. ఇచ్చిన హామీలను అమలు చేయాలి. విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామన్న మీ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు రేవంత్? పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడం ఎంతవరకు సమంజసం?
బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి
2014లో స్మృతి ఇరానీని HRD మంత్రిగా నియమించినప్పుడు ఆమె విద్యార్హతలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. మరి నేడు విద్యారంగ సమస్యలపై స్థానిక బీజేపీ నాయకుల వైఖరి ఏమిటి? ఆనాడు ఒక మాట, ఈనాడు మరో మాట ఎందుకు? ఈ విషయాన్ని రామచంద్రరావు ఆలోచించాలి'' అని శ్రవణ్ దాసోజు వ్యాఖ్యానించారు.
