తెలంగాణ

BRS : రూ.5 వేల కోట్లు.. ట్రక్‌పార్క్ భూముల వేలంపై సుప్రీంకోర్టుకు వెళ్తా : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట వద్దగల హుడా ట్రక్ పార్క్ భూములు (3.15 ఎకరాలు)ను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆన్‌లైన్ ద్వారా భూముల వేలం జరగనుంది.అయితే, ట్రక్ పార్కు భూములు వేలం వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ వేలాన్ని అడ్డుకునేందుకు ఆయన తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయడంతో పాటు అఖిలపక్షం,స్థానికులతో కలిసి నిరసనలు సైతం చేపట్టారు. ఈ-వేలంపై స్టే విధించాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వేలంపై ఎలాంటి మధ్యంతర స్టే విధించలేదు.దీంతో షెడ్యూల్ ప్రకారమే హెచ్‌ఎండీఏ ఈ-వేలం ప్రక్రియను కొనసాగిస్తోంది. తీర్పు వెలువడకముందే వేలం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టంచేశారు.