కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట వద్దగల హుడా ట్రక్ పార్క్ భూములు (3.15 ఎకరాలు)ను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆన్లైన్ ద్వారా భూముల వేలం జరగనుంది.అయితే, ట్రక్ పార్కు భూములు వేలం వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ వేలాన్ని అడ్డుకునేందుకు ఆయన తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయడంతో పాటు అఖిలపక్షం,స్థానికులతో కలిసి నిరసనలు సైతం చేపట్టారు.
తీర్పు రిజర్వు..
ఈ-వేలంపై స్టే విధించాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వేలంపై ఎలాంటి మధ్యంతర స్టే విధించలేదు.దీంతో షెడ్యూల్ ప్రకారమే హెచ్ఎండీఏ ఈ-వేలం ప్రక్రియను కొనసాగిస్తోంది. దీనిపై తాజాగా ఎమ్మెల్యే మాధవరం స్పందించారు.ట్రక్ పార్క్ భూములకు సంబంధించి కోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నప్పటికీ వేలం వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.శుక్రవారం నిర్వహించనున్న వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..
తీర్పు వెలువడకముందే వేలం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టంచేశారు. ట్రాక్ పార్క్ భూముల పరిరక్షణ కోసం న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇదిలాఉండగా, 1980వ దశకంలో హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిపై రవాణా మౌలిక సదుపాయాలు, ట్రక్కుల పార్కింగ్ వంటి ప్రజా అవసరాల కోసం అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి ఈ భూమిని సేకరించిందని ఆయన గుర్తు చేశారు.
కూకట్‌పల్లిలో గజం భూమి కూడా మిగలకుండా అన్నింటినీ అమ్మేస్తే, భవిష్యత్ తరాలకు మౌలిక సదుపాయాలు, పార్కింగ్, క్రీడా మైదానాలు, ప్రజా అవసరాల కోసం స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ విలువైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచి, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) లేదా లీజు పద్ధతిలో సమీకృత ట్రక్ టెర్మినల్, మల్టీ-లెవల్ పార్కింగ్ నిర్మించాలని సూచించారు. లేదంటే బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, కూకట్పల్లి పారిశ్రామిక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.
