తెలంగాణ

కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా ప్రభుత్వం

Rythu Nestham: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘రైతు నేస్తం’ ప్రత్యేక కార్యక్రమం (ఎపిసోడ్–114) నిర్వహించారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికల్లో రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు. వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.

వాతావరణం, నీటి పరిస్థితి

ఎల్‌నినో Elnino నేపథ్యంలో రాష్ట్రంలో వర్షపాతం, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలిపారు. బోరుబావుల్లో (Borewells) నీటిమట్టాలు క్రమంగా తగ్గుతున్నందున వరి సాగు చేయవద్దన్నారు. బదులుగా కూరగాయలు, ఆరుతడి పంటలు వేసుకోవాలని భూగర్భ జలశాఖ అధికారులు సూచించారు.

కొత్త బోరుబావులు తవ్వరాదని, ఉన్న బోరుబావులను ఫ్లషింగ్ చేసుకోవడం ద్వారా పంటలకు కొంతవరకు నీరు పొందవచ్చన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లోని నీటిమట్టాల వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నీటిని వచ్చే వేసవి చివరి వరకు తాగునీటి అవసరాలకే వినియోగించాలని సూచించారు.