తెలంగాణ

Rythu Nestham: కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా ప్రభుత్వం

Rythu Nestham: ఎల్‌నినో Elnino నేపథ్యంలో రాష్ట్రంలో వర్షపాతం, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలిపారు.

Rythu Nestham: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘రైతు నేస్తం’ ప్రత్యేక కార్యక్రమం (ఎపిసోడ్–114) నిర్వహించారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికల్లో రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు. వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.

వాతావరణం, నీటి పరిస్థితి

ఎల్‌నినో Elnino నేపథ్యంలో రాష్ట్రంలో వర్షపాతం, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలిపారు. బోరుబావుల్లో (Borewells) నీటిమట్టాలు క్రమంగా తగ్గుతున్నందున వరి సాగు చేయవద్దన్నారు. బదులుగా కూరగాయలు, ఆరుతడి పంటలు వేసుకోవాలని భూగర్భ జలశాఖ అధికారులు సూచించారు.

కొత్త బోరుబావులు తవ్వరాదని, ఉన్న బోరుబావులను ఫ్లషింగ్ చేసుకోవడం ద్వారా పంటలకు కొంతవరకు నీరు పొందవచ్చన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లోని నీటిమట్టాల వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నీటిని వచ్చే వేసవి చివరి వరకు తాగునీటి అవసరాలకే వినియోగించాలని సూచించారు.

పంట రుణాల రీషెడ్యూలింగ్

ప్రభుత్వం ప్రకటించిన 365 కరువు మండలాల్లో 254 మండలాల్లో మధ్యస్థ, 111 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ రుణాలను Kharif Loans రీషెడ్యూల్ చేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ప్రభుత్వం కోరిందని ఏజీఎం గోపాలకృష్ణమూర్తి తెలిపారు. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య తీసుకున్న ఖరీఫ్ రుణాలకు రీషెడ్యూలింగ్ చేయబడతాయని చెప్పారు. అర్హులైన రైతుల Farmers వివరాలను గ్రామాల్లో ప్రదర్శిస్తారని.. అసలు, వడ్డీ చెల్లింపులను ఏడాది పాటు వాయిదా వేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు.

సమ్మతి పత్రం (కన్సెంట్ ఫామ్) బ్యాంకులో ఇవ్వాలి

రీషెడ్యూలింగ్ వల్ల సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. రీషెడ్యూలింగ్ కోసం రైతులు సమ్మతి పత్రాన్ని (కన్సెంట్ ఫామ్) బ్యాంకులో అందజేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన గత వారం జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో జిల్లాల బ్యాంకర్లకు, కలెక్టర్లకు రీషెడ్యూలింగ్‌పై దిశానిర్దేశం చేశామని డైరెక్టర్ గోపి తెలిపారు.

దీనికి అనుగుణంగా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ల సహకారంతో సమావేశాలు నిర్వహించారని చెప్పారు. వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, సమ్మతి పత్రాలను బ్యాంకుల్లో అందజేయించాలని ఆదేశించారు.

ఆరుతడి పంటలు, పంట వ్యర్థాల నిర్వహణ

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వాటిని వినియోగించుకునే విధానాలను రాజేంద్రనగర్ సమగ్ర వ్యవసాయ పరిశోధన విభాగం సీనియర్ శాస్త్రవేత్త ప్రభాకర్ రెడ్డి వివరించారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో పంటల వైవిధ్యీకరణపై రాజేంద్రనగర్ ఏడబ్ల్యూఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త మహాదేవప్ప మాట్లాడారు.

రైతుల అనుభవాలు

వరికి బదులుగా పెసర సాగు చేసి అధిక దిగుబడి సాధించి, మార్కెట్ ధరకు విక్రయించి మంచి లాభాలు పొందామని మహబూబాబాద్ జిల్లా రైతులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో విజయం సాధించిన భూపాలపల్లి జిల్లా రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మదన్ కూడా పాల్గొన్నారు. కూరగాయలు పండించే రైతులు తమ పంటను అమ్ముకునేందుకు రైతుబజార్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్ వెంటనే స్పందించారు.

వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా మార్కెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం ఉన్న రైతు బజార్లను వినియోగించుకోవడంతో పాటు, అవసరమైన చోట కొత్త రైతు బజార్ల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని సూచించారు.

వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ కీలక ఆదేశాలు

మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, హనుమకొండ, నిర్మల్, కరీంనగర్ జిల్లాల రైతు వేదికల్లోని రైతులతో సురేంద్రమోహన్ నేరుగా మాట్లాడారు. వారి విజయగాథలు విని, సాగులో ఎదురవుతున్న సమస్యలు, కోరుతున్న సబ్సిడీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నివేదికను సోమవారంలోగా రాష్ట్రస్థాయి అధికారులకు పంపాలని ఆదేశించారు.

రైతులకు రాయితీపై పరికరాలు

ఆరుతడి పంటల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 5 లక్షల ఎకరాల్లో పంట వైవిధ్యీకరణకు ప్రతిపాదనలు వచ్చాయని ఆయన తెలిపారు. విత్తన సబ్సిడీ, రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాల పంపిణీ, సోలార్ ఫెన్సింగ్, వ్యవసాయ కుంటలు (ఫామ్ పాండ్స్), క్షేత్ర సందర్శనలు, శిక్షణ వంటి వాటి కోసం రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు. వీటన్నింటిపై సమగ్ర సమావేశం నిర్వహించి, రైతులకు రాయితీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విజయవంతంగా సాగు చేస్తున్న రైతుల అనుభవాలను ఇతర రైతులకు తెలిపేలా ‘రైతు నుంచి రైతుకు’ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను డిసెంబర్ 7లోగా రైతులందరూ రీషెడ్యూల్ చేయించుకునేలా చూడాలని ఆదేశించారు.

ఆరుతడి పంటలకు సబ్సిడీలు

ఎల్‌నినో వల్ల ఏర్పడిన తీవ్ర కరువు ప్రభావం నుంచి రైతులను ఆదుకునేందుకు, వారి పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆరుతడి పంటలకు సబ్సిడీలు Subsidy అందించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించేందుకు సుముఖంగా ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వ్యవసాయ, ఉద్యానవన, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలన్నీ రైతులకు చేరేలా కృషి చేయాలని సూచించారు.

వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ డైరెక్టర్ వేణుగోపాల్ కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేపట్టాలని, శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలు పొంది పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయ ఎలక్ట్రానిక్ విభాగం, రైతు నేస్తం విభాగం రూపొందించిన వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. శాస్త్రవేత్తలు, అధికారులు.. రైతులతో ముఖాముఖి మాట్లాడి తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు.

తర్వాత చదవండి