Telangana BJP: తెలంగాణలో బీజేపీ మెగా ఆపరేషన్.. ‘సేవా దూతల’ పేరుతో గ్రౌండ్ లెవల్ స్కెచ్!
Telangana BJP: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ఒక భారీ వ్యూహాన్ని రచించింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘సేవా దూత అభియాన్’ పేరుతో ఒక మెగా కార్యక్రమానికి బీజేపీ అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు, 25 రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో దేశంలోని 4,123 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సల్ ఇప్పటికే కీలక నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేయడానికి 119 మంది అంకితభావం కలిగిన ముఖ్య నేతలను ‘సేవా దూతలు’గా ఎంపిక చేస్తున్నారు.
