Telangana BJP: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ఒక భారీ వ్యూహాన్ని రచించింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘సేవా దూత అభియాన్’ పేరుతో ఒక మెగా కార్యక్రమానికి బీజేపీ అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు, 25 రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో దేశంలోని 4,123 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
సొంత జిల్లాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో మకాం..
తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సల్ ఇప్పటికే కీలక నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేయడానికి 119 మంది అంకితభావం కలిగిన ముఖ్య నేతలను ‘సేవా దూతలు’గా ఎంపిక చేస్తున్నారు. విశేషమేమిటంటే, వీరిని సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లకు పంపించి, అక్కడే 25 రోజుల పాటు పూర్తి సమయాన్ని కేటాయించేలా ప్లాన్ చేశారు. కేవలం తూతూమంత్రంగా పనిచేసి చేతులు దులుపుకోకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచి రాబోయే ఎన్నికల్లో ఉపయోగపడేలా ప్రభావం చూపగల నేతలనే ఈ బాధ్యతలకు ఎంపిక చేయాలని అధిష్ఠానం స్పష్టం చేసింది.
గ్రౌండ్ లెవల్లో ‘సేవా దూతలు’ ఏం చేయబోతున్నారు?
నియోజకవర్గాల్లో అడుగుపెట్టే ఈ సేవా దూతలు 25 రోజుల పాటు ప్రజల్లోనే ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. తమకు కేటాయించిన నియోజకవర్గంలో పర్యటిస్తూ బూత్, మండల స్థాయిలో పార్టీ యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేస్తారు. కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తూ స్థానిక పదాధికారులలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రైతులు, ఉపాధ్యాయులు, వీధి వ్యాపారులు, చేతివృత్తుల వారితో సమావేశమై స్థానిక సామాజిక, ఆర్థిక సమస్యలు, ఫిర్యాదులను సేకరిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారుల నమోదులో సహాయపడతారు. అంతేకాకుండా, లబ్ధిదారుల అభిప్రాయాలను వీడియోల రూపంలో రికార్డ్ చేసి అధిష్ఠానానికి పంపిస్తారు.
స్థానిక ప్రజలను కలుపుకుని చెరువులు, పాఠశాలలు, ఆసుపత్రులు లేదా పంచాయతీ భవనం వంటి ప్రభుత్వ ఆస్తులను శుభ్రపరచడం, మరమ్మతులు చేయడం, సుందరీకరించడం వంటి పనులు చేపడతారు. పని జరగడానికి ముందు, తర్వాత పరిస్థితులను ఫోటోలు, వీడియోల ద్వారా డాక్యుమెంట్ చేస్తారు. ప్రతిరోజూ పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటడంతో పాటు ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. రోగులకు సహాయం చేసేందుకు ఆసుపత్రులను సందర్శిస్తారు. వీటితో పాటు పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన శిబిరాలు, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ, స్థానిక క్రీడా టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే కేంద్రం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక డిజిటల్ కంటెంట్ క్రియేటర్లతో కలిసి ‘వికసిత భారత్ యాత్రలు’ చేపట్టనున్నారు. మొత్తానికి డిసెంబర్ నెలంతా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రజల్లోనే మమేకమవుతూ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై అధిష్ఠానానికి సమగ్ర నివేదిక అందించేందుకు ఈ ‘సేవా దూత అభియాన్’ ఒక కీలక వేదికగా మారబోతోంది.
