తెలంగాణ
Telangana Congress: ఢిల్లీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఇదేనా.. రేవంత్ రెడ్డిపై హైకమాండ్‌కి అంత నమ్మకమా?
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ నియామకం ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఇంచార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లడంతో, ఆమె స్థానంలో ఎవరో ఒక తలపండిన సీనియర్ నేతను గానీ, మాజీ ముఖ్యమంత్రి స్థాయి హెవీవెయిట్ లీడర్‌ను గానీ ఢిల్లీ పెద్దలు రంగంలోకి దించుతారని అంతా అంచనా వేశారు. కానీ, అందరి లెక్కలను తలకిందులు చేస్తూ ఏఐసీసీ కర్ణాటకకు చెందిన బీఎం సందీప్‌ను తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహామహులను చూసిన రాష్ట్రానికి, ఒక సాదాసీదా నాయకుడిని ఇంచార్జ్‌గా పంపడం వెనుక ఢిల్లీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై హైకమాండ్‌కు ఉన్న అపారమైన నమ్మకానికే ఇది నిదర్శనమా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
