Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ నియామకం ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఇంచార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లడంతో, ఆమె స్థానంలో ఎవరో ఒక తలపండిన సీనియర్ నేతను గానీ, మాజీ ముఖ్యమంత్రి స్థాయి హెవీవెయిట్ లీడర్‌ను గానీ ఢిల్లీ పెద్దలు రంగంలోకి దించుతారని అంతా అంచనా వేశారు. కానీ, అందరి లెక్కలను తలకిందులు చేస్తూ ఏఐసీసీ కర్ణాటకకు చెందిన బీఎం సందీప్‌ను తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహామహులను చూసిన రాష్ట్రానికి, ఒక సాదాసీదా నాయకుడిని ఇంచార్జ్‌గా పంపడం వెనుక ఢిల్లీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై హైకమాండ్‌కు ఉన్న అపారమైన నమ్మకానికే ఇది నిదర్శనమా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అంచనాలకు భిన్నంగా హైకమాండ్ నిర్ణయం
అధికారం చేతిలో ఉన్న రాష్ట్రం కావడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంచార్జ్ పదవికి చాలా ప్రాధాన్యం ఉంది. దీనికి తోడు ఇటీవల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు నోరు జారుతుండటం, పార్టీ క్రమశిక్షణ గాడి తప్పుతుండటం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రేపు ఎన్నికల నాటికి అసంతృప్తులు బయటపడితే ఎలా అనే ఆందోళన కూడా హస్తం వర్గాల్లో ఉంది. వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి కచ్చితంగా ఒక సీనియర్ నేతను పంపుతారని అంతా భావించారు. కానీ, హైకమాండ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరో ‘పవర్ సెంటర్’ వద్దనే వ్యూహం?
ఒక తలపండిన సీనియర్ నేతను ఇంచార్జ్‌గా నియమిస్తే, రాష్ట్రంలో మరో కొత్త ‘పవర్ సెంటర్’ తయారయ్యే ప్రమాదం ఉందని ఢిల్లీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. పైగా, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హైదరాబాద్‌లో బహిరంగంగా కొట్టుకోవడం లేదు.. ఏదైనా ఉంటే నేరుగా హస్తిన వేదికగానే చక్రం తిప్పుతున్నారు. ఇలాంటి సమయంలో పెద్దాయనను తెచ్చి పెత్తనం ఇచ్చే బదులు, అందరినీ కలుపుకొని వెళ్తూ పార్టీ నిర్మాణ వ్యవహారాలను సాఫీగా నడిపించే వ్యక్తి అయితే సరిపోతుందని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. పార్టీ ఆర్గనైజేషన్‌పై మంచి పట్టు ఉండటం వల్లే బీఎం సందీప్‌కు ఈ బాధ్యతలు అప్పగించారని గాంధీ భవన్లో టాక్ నడుస్తోంది.
రేవంత్ చేతికి పూర్తి పవర్.. ఫ్రీ హ్యాండ్!
మొత్తానికి ఈ నియామకంతో ఢిల్లీ పెద్దలు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లయింది. రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్‌కు పూర్తి నమ్మకం ఉందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు పూర్తి స్థాయిలో ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చారనే సంకేతాలు బలంగా వెళ్తున్నాయి. పాలనలో గానీ, పార్టీ నిర్ణయాల్లో గానీ పైనుంచి అనవసరపు జోక్యం ఉండదని చెప్పకనే చెప్పినట్లయింది. మరి హైకమాండ్ తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రేవంత్ రెడ్డి పార్టీలోని అసంతృప్తులను ఎలా చక్కదిద్దుతారు? రాబోయే ఎన్నికలకు కేడర్‌ను ఎలా సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
