TG: 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు.. తెలంగాణ సర్కార్ మెగా టార్గెట్!
TG: తెలంగాణలో వ్యవసాయ రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం ఒక భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఏకంగా 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. శనివారం చేవేళ్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించి, చిన్న, సన్నకారు, గిరిజన, దళిత రైతులను ఆర్థికంగా నిలబెట్టడమే తమ అసలు ప్లాన్ అని చెప్పారు.రాష్ట్రంలో ప్రస్తుతం 3.37 లక్షల ఎకరాల్లో 92,504 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 2023 తర్వాత కొత్తగా 46,840 మంది రైతులు 1.54 లక్షల ఎకరాల్లో తోటలు వేశారు. ఇక 10 లక్షల ఎకరాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.261.35 కోట్లు కేటాయించగా, 85 వేల ఎకరాల సాగు టార్గెట్లో ఇప్పటికే 46,503 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయింది.
