తెలంగాణ

TG: 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు.. తెలంగాణ సర్కార్ మెగా టార్గెట్!

TG: తెలంగాణలో వ్యవసాయ రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం ఒక భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఏకంగా 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. శనివారం చేవేళ్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు.

TG: తెలంగాణలో వ్యవసాయ రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం ఒక భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఏకంగా 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. శనివారం చేవేళ్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించి, చిన్న, సన్నకారు, గిరిజన, దళిత రైతులను ఆర్థికంగా నిలబెట్టడమే తమ అసలు ప్లాన్ అని చెప్పారు.

10 లక్షల ఎకరాల టార్గెట్‌కు పక్కా రోడ్‌మ్యాప్!

రాష్ట్రంలో ప్రస్తుతం 3.37 లక్షల ఎకరాల్లో 92,504 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 2023 తర్వాత కొత్తగా 46,840 మంది రైతులు 1.54 లక్షల ఎకరాల్లో తోటలు వేశారు. ఇక 10 లక్షల ఎకరాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.261.35 కోట్లు కేటాయించగా, 85 వేల ఎకరాల సాగు టార్గెట్‌లో ఇప్పటికే 46,503 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయింది. కొత్తగా మరో 39,778 మంది రైతులు 1.34 లక్షల ఎకరాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. రైతులకు మొక్కల కొరత రాకుండా ఈ ఏడాది 30.21 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచామని, 2027-28 కోసం ఏకంగా 65 లక్షల మొలకలకు ఇండెంట్ పెట్టామని మంత్రి తుమ్మల వివరించారు.

ఎకరానికి రూ.2 లక్షల ఆదాయం.. రూ.22 వేలు దాటిన టన్ను ధర

రైతులు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇందులో వచ్చే లాభాలేనని మంత్రి గుర్తుచేశారు. ఒకసారి తోట వేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని, ఖర్చులన్నీ పోను ఎకరానికి ఏటా రూ.2 లక్షల వరకు నికర ఆదాయం మిగులుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చే నాటికి టన్ను గెలల ధర రూ.12,534 ఉంటే, ఇప్పుడు ఏకంగా రూ.22,658కి చేరిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 5.20 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను కొనుగోలు చేసి, 25,242 మంది రైతుల ఖాతాల్లో రూ.1,213 కోట్లు జమ చేశామని తెలిపారు. తోటల పెంపకానికి ఎకరానికి రూ.46,250 సబ్సిడీ ఇస్తూ ఇప్పటి వరకు 75,628 మంది రైతులకు రూ.442.74 కోట్లు అందించామన్నారు. NMEO-OP పథకం అమలుతో పాటు ఆయిల్ రికవరీ (OER)లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

మళ్లీ యాంత్రీకరణ పథకం.. తోటల్లో సమస్యలకు చెక్

చిన్న రైతులపై పనిముట్ల భారం పడకుండా గతంలో ఆగిపోయిన ఫార్మ్ మెకనైజేషన్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని తుమ్మల ప్రకటించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), ఆయిల్‌ఫెడ్, ప్రైవేట్ కంపెనీల సహకారంతో మండలాల వారీగా యంత్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు. తోటలు వేసిన మొదటి మూడేళ్లు సూర్యరశ్మికి అడ్డురాని కూరగాయలు, తీగజాతి అంతర పంటలు వేసుకుంటే అదనపు ఆదాయం వస్తుందని సూచించారు. మరోవైపు నర్సరీలు నాణ్యమైన మొక్కలనే ఇవ్వాలని, నాణ్యత విషయంలో తేడా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తోటల్లో విద్యుత్ లైన్ల క్రమబద్ధీకరణ, ఫెన్సింగ్, నీటి వసతి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, రైతులకు దగ్గర్లోనే గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే తోటల్లో వేపగింజలు, నీమ్ కేక్ లాంటి సహజ ఎరువులు వాడాలని కోరారు. ఇప్పటికే ఆయిల్ పామ్ సాగులో సక్సెస్ అయిన రైతులను 'రైతు రాయబారులు'గా గుర్తించి, మిగతా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పలువురు మార్కెట్ కమిటీ, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.

తర్వాత చదవండి