Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో 'మిషన్ బలోపేతం'.. ఆ రెండు ఎన్నికలే టార్గెట్గా పార్టీల హడావిడి!
Telangana Politics: తెలంగాణ గడ్డపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అత్యంత కీలకమైన ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కదనరంగంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు భారీ బహిరంగ సభలు, మరోవైపు జాతీయ నేతల వరుస టూర్లు, ఇంకోవైపు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అధికార కాంగ్రెస్ 'మిషన్ బలోపేతం'..
అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరింత పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. తొలిసారిగా ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ సందీప్ రాష్ట్రానికి రానుండటంతో హస్తం వర్గాల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ స్థానాలపై ఆయన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూనే, అసంతృప్త నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన సవాలు. అధికార బలంతో పాటు పక్కా సామాజిక సమీకరణాలతో విపక్షాల ఎత్తులను చిత్తు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
