తెలంగాణ

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో 'మిషన్ బలోపేతం'.. ఆ రెండు ఎన్నికలే టార్గెట్‌గా పార్టీల హడావిడి!

Telangana Politics: తెలంగాణ గడ్డపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అత్యంత కీలకమైన ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కదనరంగంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు భారీ బహిరంగ సభలు, మరోవైపు జాతీయ నేతల వరుస టూర్లు, ఇంకోవైపు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Telangana Politics: తెలంగాణ గడ్డపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అత్యంత కీలకమైన ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కదనరంగంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు భారీ బహిరంగ సభలు, మరోవైపు జాతీయ నేతల వరుస టూర్లు, ఇంకోవైపు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అధికార కాంగ్రెస్ 'మిషన్ బలోపేతం'..

అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరింత పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. తొలిసారిగా ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ సందీప్ రాష్ట్రానికి రానుండటంతో హస్తం వర్గాల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ స్థానాలపై ఆయన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూనే, అసంతృప్త నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన సవాలు. అధికార బలంతో పాటు పక్కా సామాజిక సమీకరణాలతో విపక్షాల ఎత్తులను చిత్తు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

జాతీయ నాయకత్వం అండతో కమలం దూకుడు

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బీజేపీ ఇప్పటికే దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ టూర్ ఖరారు కావడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'నశా ముక్త్ భారత్' నినాదంతో యువతను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక అంశాలను రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

సెంటిమెంట్, భారీ సభలతో గులాబీ దళం కౌంటర్

ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మళ్లీ తన పూర్వ వైభవం చాటాలని వరుస బహిరంగ సభలతో హోరెత్తిస్తోంది. ఓరుగల్లు గడ్డపై భారీ సభను నిర్వహిస్తూ తమ బలం ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. అంతటితో ఆగకుండా, ఈ నెల 29న కరీంనగర్ అలుగునూరులో 'దీక్షా దివస్' పేరిట మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలని గులాబీ అగ్రనాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

మొత్తం మీద తెలంగాణ రాజకీయం ఇప్పుడు త్రిముఖ పోరుకు వేదికగా మారింది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ద్వారా నగర ఓటర్ల నాడి తెలిసే అవకాశం ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికలు మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఏ పార్టీకి ఎంత పట్టుందో తేల్చనున్నాయి. మరి ఈ మూడు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య రాబోయే ఎన్నికల్లో పైచేయి సాధించేది ఎవరో చూడాలి.

తర్వాత చదవండి