తెలంగాణ

TG: తెలంగాణలో వేడెక్కిన ప్రోటోకాల్ పాలిటిక్స్!

TG: ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేకు ఉండే గౌరవమే వేరు. ఒక నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా, ఏ అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసినా ముందు వరుసలో ఉండాల్సింది స్థానిక ఎమ్మెల్యేనే. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయిందనే చర్చ జోరుగా నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి, ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకే అధికారులు పెద్దపీట వేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ భగ్గుమంటోంది. నియోజకవర్గాల స్థాయిలో మొదలైన ఈ ఆధిపత్య పోరు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఛాంబర్ వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.క్షేత్రస్థాయిలో తమకు కనీస ప్రోటోకాల్ దక్కడం లేదని హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుంటే ఎమ్మెల్యేలైన తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు అధికారులు రిపోర్ట్ చేస్తున్నారని మండిపడుతున్నారు.