TG: ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేకు ఉండే గౌరవమే వేరు. ఒక నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా, ఏ అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసినా ముందు వరుసలో ఉండాల్సింది స్థానిక ఎమ్మెల్యేనే. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయిందనే చర్చ జోరుగా నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి, ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకే అధికారులు పెద్దపీట వేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ భగ్గుమంటోంది. నియోజకవర్గాల స్థాయిలో మొదలైన ఈ ఆధిపత్య పోరు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఛాంబర్ వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
వేదికపై కుర్చీల్లేవ్.. పనుల్లో సమాచారం లేదు!
క్షేత్రస్థాయిలో తమకు కనీస ప్రోటోకాల్ దక్కడం లేదని హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుంటే ఎమ్మెల్యేలైన తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లకు అధికారులు రిపోర్ట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు, అధికారిక సభల్లో ప్రజలు ఎన్నుకున్న తమను కింద కూర్చోబెట్టి, ఓడిపోయిన కాంగ్రెస్ నేతలను వేదికపై కూర్చోబెడుతున్నారని వాపోతున్నారు. అభివృద్ధి పనుల పరిశీలనకు కూడా అధికారులే దగ్గరుండి కాంగ్రెస్ నేతలను తీసుకెళ్తున్నారంటూ ఆధారాలతో సహా సీఎస్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
గ్రేటర్ చుట్టుపక్కల మరీ శ్రుతిమించిందా?
రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నప్పటికీ, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరీ దారుణంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఎమ్మెల్యేలమనే విషయాన్నే అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని, అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి రూల్స్‌ని తుంగలో తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, గతంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్పీకర్ నుంచి సీఎస్ దాకా.. తర్వాతి స్టెప్ ఏంటి?
ప్రోటోకాల్ వివాదంపై ఇప్పటికే స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదు కాపీలతో పాటు, తాజాగా జరిగిన ఘటనల వివరాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎస్‌కు అందజేశారు. రూల్స్ అతిక్రమించిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ దగ్గరి నుంచి ఇప్పుడు సీఎస్ వరకు వెళ్లినా న్యాయం జరగకపోతే, భవిష్యత్తులో మరో విధంగా పోరాటం చేయక తప్పదని ప్రభుత్వానికి, అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మొత్తానికి ఒకవైపు అధికార పార్టీ ఇన్‌ఛార్జ్‌ల హవా, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఆగ్రహంతో నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. మరి సీఎస్ జోక్యంతోనైనా ఈ ప్రోటోకాల్ పాలిటిక్స్‌కు బ్రేక్ పడుతుందా? లేక రానున్న రోజుల్లో ఈ రగడ మరింత ముదురుతుందా? అనేది చూడాలి.
