TG: ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో బిల్డర్ల మాయాజాలం.. రూ.25 లక్షల ఫైన్ వేసిన తెలంగాణ రెరా!
TG: హైదరాబాద్‌లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులను 'ప్రీ-లాంచ్ ఆఫర్ల' పేరుతో ఆకర్షిస్తున్న బిల్డర్లకు తెలంగాణ రెరా గట్టి షాకిచ్చింది. కనీసం రెరా రిజిస్ట్రేషన్ కూడా లేకుండానే కోట్ల రూపాయల ఫ్లాట్లకు ప్రకటనలు ఇస్తూ, భూమిపై ఉన్న కోర్టు కేసులను దాచిపెడుతున్న బడా సంస్థల భరతం పట్టింది. తాజాగా ఒకేసారి మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకంగా రూ.41 లక్షలకు పైగా ఫైన్ విధించగా, మరో సంస్థకు 30 రోజుల అల్టిమేటం జారీ చేసింది.కొండాపూర్‌లో నిర్మించబోతున్న ‘ఆరో సఫైర్’ ప్రాజెక్టుకు ఎలాంటి రెరా అనుమతులు లేకుండానే డిజిటల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆరో రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రెరా రూ.25 లక్షల భారీ జరిమానా విధించింది. సుమారు 8 ఎకరాల్లో నాలుగు టవర్లు, 1,300కు పైగా ఫ్లాట్లతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.2 కోట్ల నుంచి మొదలవుతుందంటూ ప్రకటనలు గుప్పించారు. దీనిపై వివరణ అడిగితే.. తమ కంపెనీ పేరు, లోగోను బయటి వ్యక్తులు ఎవరో అనధికారికంగా వాడుకున్నారని ఆరో రియాల్టీ చెప్పిన సాకును అధికారులు నమ్మలేదు.
