తెలంగాణ

TG: ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో బిల్డర్ల మాయాజాలం.. రూ.25 లక్షల ఫైన్ వేసిన తెలంగాణ రెరా!

TG: హైదరాబాద్‌లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులను 'ప్రీ-లాంచ్ ఆఫర్ల' పేరుతో ఆకర్షిస్తున్న బిల్డర్లకు తెలంగాణ రెరా గట్టి షాకిచ్చింది. కనీసం రెరా రిజిస్ట్రేషన్ కూడా లేకుండానే కోట్ల రూపాయల ఫ్లాట్లకు ప్రకటనలు ఇస్తూ, భూమిపై ఉన్న కోర్టు కేసులను దాచిపెడుతున్న బడా సంస్థల భరతం పట్టింది. తాజాగా ఒకేసారి మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకంగా రూ.41 లక్షలకు పైగా ఫైన్ విధించగా, మరో సంస్థకు 30 రోజుల అల్టిమేటం జారీ చేసింది.

TG: హైదరాబాద్‌లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులను 'ప్రీ-లాంచ్ ఆఫర్ల' పేరుతో ఆకర్షిస్తున్న బిల్డర్లకు తెలంగాణ రెరా గట్టి షాకిచ్చింది. కనీసం రెరా రిజిస్ట్రేషన్ కూడా లేకుండానే కోట్ల రూపాయల ఫ్లాట్లకు ప్రకటనలు ఇస్తూ, భూమిపై ఉన్న కోర్టు కేసులను దాచిపెడుతున్న బడా సంస్థల భరతం పట్టింది. తాజాగా ఒకేసారి మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకంగా రూ.41 లక్షలకు పైగా ఫైన్ విధించగా, మరో సంస్థకు 30 రోజుల అల్టిమేటం జారీ చేసింది.

'ప్రీ-లాంచ్' అంటే కుదరదు.. ఆరో రియాల్టీకి రూ.25 లక్షల ఫైన్!

కొండాపూర్‌లో నిర్మించబోతున్న ‘ఆరో సఫైర్’ ప్రాజెక్టుకు ఎలాంటి రెరా అనుమతులు లేకుండానే డిజిటల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆరో రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రెరా రూ.25 లక్షల భారీ జరిమానా విధించింది. సుమారు 8 ఎకరాల్లో నాలుగు టవర్లు, 1,300కు పైగా ఫ్లాట్లతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.2 కోట్ల నుంచి మొదలవుతుందంటూ ప్రకటనలు గుప్పించారు. దీనిపై వివరణ అడిగితే.. తమ కంపెనీ పేరు, లోగోను బయటి వ్యక్తులు ఎవరో అనధికారికంగా వాడుకున్నారని ఆరో రియాల్టీ చెప్పిన సాకును అధికారులు నమ్మలేదు. ప్రీ-లాంచ్ పేరుతో ప్రచారం చేస్తే రెరా రూల్స్ నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. 30 రోజుల్లోగా ఈ రూ.25 లక్షల జరిమానా కట్టకపోతే రెరా చట్టంలోని సెక్షన్ 63 కింద మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జనప్రియ టౌన్‌షిప్స్‌కు రూ.10 లక్షల జరిమానా.. బుకింగ్‌లు బంద్

రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే చందానగర్‌లో ‘బహితి’, సైనిక్‌పురిలో ‘ఆల్టెయిర్’ ప్రాజెక్టులకు ప్రకటనలు ఇస్తున్న జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల ఫైన్ పడింది. అంతేకాకుండా, ఇప్పటికే రెరా అనుమతి పొందిన నైల్ వ్యాలీ, లేక్ ఫ్రంట్, సితార ప్రాజెక్టుల ప్రకటనల్లో రెరా నంబర్లు అసలు కంటికే కనిపించనంత చిన్నగా వేయడంపైనా అధికారులు సీరియస్ అయ్యారు. ఆ రెండు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు, ప్రచారం, బుకింగ్‌లు, అమ్మకాలను తక్షణమే ఆపేయాలని ఆదేశించారు. నెల రోజుల్లో జరిమానా కట్టడంతో పాటు, అన్ని ప్రభుత్వ అనుమతులు వచ్చిన 30 రోజుల్లోగా రెరా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కోర్టు కేసులు దాచినందుకు రూ.6.10 లక్షల ఫైన్

కాప్రాలోని ‘జీకేస్ ప్రవిష్ అబోడ్’ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ సమయంలో, ఆ భూమిపై కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసుల వివరాలను దాచిపెట్టిన జీకేహెచ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రెరా రూ.6,10,390 జరిమానా విధించింది. రిజిస్ట్రేషన్ టైమ్‌లో అసంపూర్తిగా, తప్పుదోవ పట్టించే వివరాలు ఇవ్వడం సెక్షన్ 4 కింద నేరమని స్పష్టం చేసింది. ఆ తర్వాత కోర్టు కేసులు ముగిసిపోయినా, బిల్డింగ్ పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) వచ్చినా సరే.. గతంలో చేసిన తప్పుకు 30 రోజుల్లో జరిమానా కట్టాల్సిందేనని తేల్చిచెప్పింది.

వెస్టర్న్ విండ్సర్ పార్క్‌కు 30 రోజుల డెడ్‌లైన్

పుప్పాలగూడలోని ‘వెస్ట్రన్ విండ్సర్ పార్క్’ ప్రాజెక్టు భూమి, నిర్మాణ పనులపై కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులు, కోర్టు ఆర్డర్ల పూర్తి వివరాలను 30 రోజుల్లోగా సమర్పించాలని వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ విండ్సర్ పార్క్ ఎల్‌ఎల్‌పీని రెరా ఆదేశించింది. ఒక ప్రాజెక్టు కోసం ఇచ్చిన కోర్టు వివరాలను మరో ప్రాజెక్టుకు లెక్కలోకి తీసుకోమని, ప్రతి ప్రాజెక్టుకు విడివిడిగా వివరాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ రిపోర్ట్, రికార్డులను పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి ఎలాంటి జరిమానా లేకుండా విచారణను ముగించింది. అయితే, విచారణ ముగిసినంత మాత్రాన ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఖరారైనట్లు గానీ, ఆక్రమణల ఆరోపణలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు గానీ భావించకూడదని గట్టి వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో ఏ సమాచారాన్ని దాచినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

తర్వాత చదవండి