TG police: సజ్జనార్‌పై పోస్టు.. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావుకు ‘ఎక్స్’ నోటీసులు!
నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్రాంత ఐపీఎస్, సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావుకు షాక్ తగిలింది. సజ్జనార్ మీద పెట్టిన పోస్టుకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ ఆయనకు నోటీసులు పంపించింది. విశ్రాంత ఐపీఎస్ పెట్టిన పోస్టు మీద చర్యలు కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఎక్స్’కు అభ్యర్థన పంపగా.. ఆ సంస్థ నోటీసులు పంపించినట్టు సమాచారం. ఈ విషయం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నగర సీపీగా బదిలీ అయిన వీసీ సజ్జనార్‌ను ఉద్దేశించి నాగేశ్వరరావు తన ‘ఎక్స్’ ఖాతాలో సంచలన ఆరోపణలు చేశారు.‘యూనిఫామ్ వేసుకున్న నేరస్తుడు’గా అభివర్ణిస్తూ పోస్టు పెట్టారు. అయితే, ఈ పోస్టు భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నుంచి తమకు అభ్యర్థన అందిందని ‘ఎక్స్’ సంస్థ విశ్రాంత ఐపీఎస్‌కు ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపింది.
