నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్రాంత ఐపీఎస్, సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావుకు షాక్ తగిలింది. సజ్జనార్ మీద పెట్టిన పోస్టుకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ ఆయనకు నోటీసులు పంపించింది. విశ్రాంత ఐపీఎస్ పెట్టిన పోస్టు మీద చర్యలు కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఎక్స్’కు అభ్యర్థన పంపగా.. ఆ సంస్థ నోటీసులు పంపించినట్టు సమాచారం. ఈ విషయం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్రిమినల్ ఇన్ యూనిఫాం..
నగర సీపీగా బదిలీ అయిన వీసీ సజ్జనార్‌ను ఉద్దేశించి నాగేశ్వరరావు తన ‘ఎక్స్’ ఖాతాలో సంచలన ఆరోపణలు చేశారు.‘యూనిఫామ్ వేసుకున్న నేరస్తుడు’గా అభివర్ణిస్తూ పోస్టు పెట్టారు. అయితే, ఈ పోస్టు భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నుంచి తమకు అభ్యర్థన అందిందని ‘ఎక్స్’ సంస్థ విశ్రాంత ఐపీఎస్‌కు ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ప్రభుత్వం లేదా చట్టాన్ని అమలు చేసే విభాగాల నుంచి కంటెంట్ తొలగించాలని అభ్యర్థన వచ్చినప్పుడు వినియోగదారులకు సమాచారం అందించడం తమ విధానమని ఎక్స్ పేర్కొంది. ఈ అభ్యర్థనను కోర్టులో సవాలు చేయడం, న్యాయ సలహా తీసుకోవడం లేదా ఇతర మార్గాలను పరిశీలించుకోవచ్చని సీబీఐ మాజీ డైరెక్టర్‌కు సూచించింది.

హైదరాబాద్ సీపీకి నాగేశ్వరరావు ప్రశ్నలు..
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ఎక్స్’ నుంచి తనకు నోటీసు రావడంపై విశ్రాంత ఐపీఎస్ నాగేశ్వరరావు మరోసారి స్పందించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను ట్యాగ్ చేస్తూ.. తన పోస్టు భారతీయ చట్టంలోని ఏయే నిర్దిష్ట సెక్షన్లను ఉల్లంఘించిందో సంబంధిత పోలీసు అధికారులతో స్పష్టం చేయించాలని కోరారు. కేవలం చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొనడం కాకుండా, అందుకు సంబంధించిన చట్టపరమైన ఆధారాలను వెల్లడించాలని పరోక్షంగా ప్రశ్నలు గుప్పించారు.
సజ్జనార్ మీద విధేయత చూపుతున్నారా?
నగర పోలీసు అధికారులు చట్టం పట్ల కాకుండా తమ మాజీ బాస్ సజ్జనార్ పట్ల ఎక్కువ విధేయత చూపుతున్నట్టు కనిపిస్తోందని ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.చట్టబద్ధమైన పోలీసింగ్‌ను నిర్ధారించే విషయంలో ప్రస్తుత పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మాజీ సీపీ సజ్జనార్‌పై విశ్రాంత ఐపీఎస్ పెట్టిన పోస్టు, దానిపై చర్యలు కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసుల అభ్యర్థన, ఎక్స్ ఈ మెయిల్ పంపడం వంటి అంశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
