రాజకీయాలు

AP TamilNadu Leakage Row: ఏపీ-తమిళనాడు లీకేజీల మంట.. తెలంగాణ యంత్రాంగంలోనూ ఇదే గుబులు?

పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. తమిళనాడు పరిశ్రమల శాఖకు చెందిన కీలక పెట్టుబడుల సమాచారం ఏపీకి లీక్ అయిందనే ఆరోపణలతో 15మంది అధికారులను సస్పెండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాజకీయాలు, పరిపాలనా వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.కీర్తన పర్యవేక్షణలోని పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ 'గైడెన్స్ తమిళనాడు' (Guidance Tamil Nadu) సీనియర్ అధికారులపై వేటు పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.  సస్పెండ్ అయిన వారిలో చాలామంది గత ప్రభుత్వాల హయాంలో నియమితులై, అనుభవం దృష్ట్యా కొనసాగుతున్నవారని, ముగ్గురు అధికారులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల విభాగంలో పనిచేస్తున్నారని గుర్తించడం వివాదాన్ని మరింత రాజేసింది. తమిళనాడులో వెలుగుచూసిన ఈ పరిణామంతో ఇప్పుడు తెలంగాణ పరిపాలనా వర్గాల్లోనూ ఇదే తరహా చర్చ జోరుగా నడుస్తోంది. ఇక్కడి నుంచి ఏపీకి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి కీలక సమాచారం లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.