తమిళనాడులో 15 మందిపై వేటు
ఏపీ పెట్టుబడుల విభాగంలో ముగ్గురు?
ఏపీ - తెలంగాణలోనూ లీకేజీలు ఉన్నాయా?
సలహాదారులు, మాజీ అధికారులపై చర్చ
సమాచార భద్రతపై పెరుగుతున్న నిఘా
పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. తమిళనాడు పరిశ్రమల శాఖకు చెందిన కీలక పెట్టుబడుల సమాచారం ఏపీకి లీక్ అయిందనే ఆరోపణలతో 15మంది అధికారులను సస్పెండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాజకీయాలు, పరిపాలనా వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.కీర్తన పర్యవేక్షణలోని పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ 'గైడెన్స్ తమిళనాడు' (Guidance Tamil Nadu) సీనియర్ అధికారులపై వేటు పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సస్పెండ్ అయిన వారిలో చాలామంది గత ప్రభుత్వాల హయాంలో నియమితులై, అనుభవం దృష్ట్యా కొనసాగుతున్నవారని, ముగ్గురు అధికారులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల విభాగంలో పనిచేస్తున్నారని గుర్తించడం వివాదాన్ని మరింత రాజేసింది. తమిళనాడులో వెలుగుచూసిన ఈ పరిణామంతో ఇప్పుడు తెలంగాణ పరిపాలనా వర్గాల్లోనూ ఇదే తరహా చర్చ జోరుగా నడుస్తోంది. ఇక్కడి నుంచి ఏపీకి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి కీలక సమాచారం లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసి వచ్చిన శ్రీనివాస్ రాజు, ఆదిత్యనాథ్ దాస్ వంటి అధికారుల నేపథ్యాలు, ఏపీ నుంచి రిటైర్డ్ అయ్యాక తెలంగాణలో సలహాదారులుగా, ఇతర కీలక హోదాల్లో కొనసాగుతున్న వారి వ్యవహారశైలిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ అనంతరం కూడా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా ప్రభుత్వ వ్యూహాలు, సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందా? అనే కోణంలో పాలనా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల బదిలీలపైనా రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఇటీవల శ్రీశైలం సీఈ(CE) బదిలీ చేయాల్సి రావడం వెనుక కూడా ఇలాంటి కారణాలేమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కీలక ప్రాజెక్టులు, నిధులు, నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి లీకేజీలు, లోపాలు తలెత్తకుండా ఉండేందుకే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా, ఇతర కీలక రంగాల్లోనూ పెట్టుబడులు, అవకాశాలు ఏపీ వైపు తరలివెళ్తున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు సస్పెన్షన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన గోప్యత, అధికారుల నియామకాలు, బదిలీలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. భవిష్యత్తులో సమాచార భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని పాలనా నిపుణులు సూచిస్తున్నారు.
