National

Karthigai Deepam: తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏండ్ల తర్వాత వెలిగిన దీపం..

Karthigai Deepam: తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపై సుమారు వందేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కార్తిక మహాదీపం వెలిగింది. దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలు, కోర్టు కేసుల నడుమ శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కొండపై ఉన్న పురాతన రాతిస్తంభం (దీపథూన్)పై ఆలయ పూజారులు దీపాన్ని వెలిగించారు. ఇప్పటికే ఉచ్చిపిళ్లైయార్ మండపంపై వెలుగుతున్న దీపం నుంచి అగ్నిజ్వాలను తీసుకొచ్చి, ఈ రాతిస్తంభంపై వెలిగించడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ బలగాల భారీ భద్రత మధ్య, రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్, జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది.