జాతీయం

Karthigai Deepam: తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏండ్ల తర్వాత వెలిగిన దీపం..

Karthigai Deepam: తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపై సుమారు వందేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కార్తిక మహాదీపం వెలిగింది. దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలు, కోర్టు కేసుల నడుమ శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కొండపై ఉన్న పురాతన రాతిస్తంభం (దీపథూన్)పై ఆలయ పూజారులు దీపాన్ని వెలిగించారు.

Karthigai Deepam: తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపై సుమారు వందేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కార్తిక మహాదీపం వెలిగింది. దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలు, కోర్టు కేసుల నడుమ శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కొండపై ఉన్న పురాతన రాతిస్తంభం (దీపథూన్)పై ఆలయ పూజారులు దీపాన్ని వెలిగించారు. ఇప్పటికే ఉచ్చిపిళ్లైయార్ మండపంపై వెలుగుతున్న దీపం నుంచి అగ్నిజ్వాలను తీసుకొచ్చి, ఈ రాతిస్తంభంపై వెలిగించడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ బలగాల భారీ భద్రత మధ్య, రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్, జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది.

దర్గా చుట్టూ బఫర్ జోన్.. 50 మంది భక్తులకే అనుమతి

వందేళ్ల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో కొండ కిందకు చేరుకున్నారు. అయితే ఎలాంటి గొడవలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. అంతేకాకుండా, కొండపై ఉన్న సిక్కందర్ దర్గా చుట్టూ 50 మీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించి, అడుగడుగునా పోలీసు, కేంద్ర బలగాలను మోహరించారు.

వందేళ్ల వివాదానికి తెరపడింది ఇలా..

తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని ఉచ్చిపిళ్లైయార్ మండపంపై ఏటా కార్తిక దీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కొండపై ఉన్న దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించే సంప్రదాయాన్ని మళ్లీ మొదలుపెట్టాలంటూ దాదాపు వందేళ్లుగా వివాదం నడుస్తోంది. గతేడాది మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇందుకు అనుమతి ఇచ్చినా అప్పట్లో అది అమలు కాలేదు. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, ఈ ఏడాదికి మాత్రమే రాతిస్తంభంపై దీపం వెలిగించేందుకు నవంబర్ 20న సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్‌తో దిగొచ్చిన ప్రభుత్వం

అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా కార్తిక పౌర్ణమి నాడు పాత పద్ధతిలోనే మండపంపై దీపం వెలిగించడం పెద్ద వివాదానికి దారితీసింది. తమిళనాడు ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. శనివారం రాతిస్తంభంపై దీపం వెలిగించి తీరాల్సిందేనని గట్టి వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, శనివారం సాయంత్రం పక్కా భద్రత నడుమ దీపాన్ని వెలిగించడంతో వందేళ్ల కల నెరవేరినట్లయింది.

తర్వాత చదవండి