Hyderabad : ఒకరి తర్వాత మరొకరు.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ముగ్గురి మృతి
హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు మిత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా ట్యాంక్ క్లీన్ చేసేందుకు ఒకరు లోనికి దిగగా అందులోని విషవాయువులు పీల్చి స్పృహ కోల్పోయాడు. అతన్ని కాపాడేందుకు మరొకరు దిగగా అతను కూడా స్పృహ కోల్పోయాడు. ఇలా మరొకరు సైతం వారిద్దరిని కాపాడేందుకు దిగగా.. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్మెంట్లో ఎస్టీపీ (సెప్టిక్‌ట్యాంక్) శుభ్రం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. షణ్ముఖరావు అలియాస్ సుమన్ (26), వై.పవన్ (20), సురేష్ గజికి (24)గా వెళ్లారు.ముందుగా సుమన్ సెప్టిక్ ట్యాంక్‌లోని దిగగా విషవాయువులు పీల్చి అందులోనే పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు పవన్.. ఆ తర్వాత సురేశ్ దిగగా వీరు సైతం విషవాయువులు పీల్చి ఊపిరాడక మృతి చెందారు.
