క్రైమ్

Hyderabad : ఒకరి తర్వాత మరొకరు.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ముగ్గురి మృతి

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు మిత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి ఒకేసారి ముగ్గురు మరణించారు.

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు మిత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా ట్యాంక్ క్లీన్ చేసేందుకు ఒకరు లోనికి దిగగా అందులోని విషవాయువులు పీల్చి స్పృహ కోల్పోయాడు. అతన్ని కాపాడేందుకు మరొకరు దిగగా అతను కూడా స్పృహ కోల్పోయాడు. ఇలా మరొకరు సైతం వారిద్దరిని కాపాడేందుకు దిగగా.. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌లో ఎస్టీపీ (సెప్టిక్‌ట్యాంక్) శుభ్రం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. షణ్ముఖరావు అలియాస్ సుమన్ (26), వై.పవన్ (20), సురేష్ గజికి (24)గా వెళ్లారు.ముందుగా సుమన్ సెప్టిక్ ట్యాంక్‌లోని దిగగా విషవాయువులు పీల్చి అందులోనే పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు పవన్.. ఆ తర్వాత సురేశ్ దిగగా వీరు సైతం విషవాయువులు పీల్చి ఊపిరాడక మృతి చెందారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా (HYDRAA) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశాయి. అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మృతుల బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

'హెచ్ఆర్ ఎన్విరో ప్రొటెక్షన్ సిస్టమ్' (HR Enviro) అనే ప్రైవేట్ సంస్థకు చెందిన యజమాని రవి.. మరణించిన కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలు (Safety gear) అందించకుండా సెప్టిక్‌ట్యాంక్‌లోకి పంపినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సంబంధిత కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

తర్వాత చదవండి